చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ కు తాము కట్టుబడి ఉన్నామని, దీన్ని సాధించే వరకూ పోరాడతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మహిళలు కూడా పురుషులతో సమానంగా చదువుకోవాలన్న ఆశయంతో తిరుపతిలో మహిళా విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మహిళలు కూడా ఆస్తిలో సమాన హక్కు చట్టం ద్వారా ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో 9 శాతం రిజర్వేషన్ ఎన్టీఆర్ అమలు చేస్తే దాన్ని తన హయంలో 33 శాతానికి పెంచామని గుర్తు చేశారు. బనగానపల్లెలో ‘మహిళలతో ప్రజావేదిక’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీలో కీచకులు ఉన్నారని, మహిళలపై వేధింపులకు పాల్పడిన ముగ్గురికి ఎంపి సీట్లు ఇచ్చారని, ఎంపీలు, ఎమ్మెల్యేలపై సుమారు 400పైగా కేసులు ఉన్నాయని విమర్శించారు. వైసీపీ పాలనలో ఆడబిడ్డలపై వేధింపులు ఎక్కువయ్యాయని, జాతీయ సగటు కంటే 44శాతం ఎక్కువగా మన రాష్ట్రంలో జరుగుతున్నాయని అన్నారు.
తమ ప్రభుత్వ హయంలో మహిళల రక్షణ కోసం ఓ యాప్ తయారు చేస్తే దాన్ని ఇప్పుడు దిశా పేరుతో ఇచ్చారని, కానీ ఓ దిశా లేదు దశా లేదు అంటూ వ్యాఖ్యానించారు. నిర్భయ ఫండ్ నిధులు కూడా ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. మహిళల భద్రతలో మన రాష్ట్రం 22వ స్థానంలో ఉందని.. బీహార్, ఉత్తర ప్రదేశ్ కంటే వెనుకబడి ఉన్నామన్నారు. మహిళలను చైతన్యం తీసుకు రావడానికే ‘బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట మహా శక్తి పథకం ప్రకటించామని తెలిపారు.