అది జోకర్ సేన: దాడిశెట్టి రాజా

సోమవారం నుంచి శుక్రవారం వరకు తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్‌ రాజకీయం చేస్తారని, ఆ తర్వాత రెండు రోజులు.. శని, ఆదివారాలు పవన్‌ ఆ బాధ్యత తీసుకున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాటిశెట్టి రాజా విమర్శించారు. వ్యూహాత్మకంగా ఆ రెండు రోజులు బాబు, ఆయన కొడుకు బయట కనబడరని, ఎందుకంటే శని, ఆదివారాలు పవన్ టిడిపికి కాల్‌షీట్‌ ఇచ్చారని, వారి డైరెక్షన్‌ మేరకు, ఏబీఎన్‌ ఆంధ్ర జ్యోతి డైరెక్షన్‌ మేరకు నోటికొచ్చినట్లు తింగరి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని పవన్ ను ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. 35 ఏళ్ళలో లేని వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే పవన్ కళ్యాణ్ వచ్చి రాజకీయం చేయడం తగదన్నారు. జనసేన జోకర్ సేన గా మారిందని అభివర్ణించారు. జనసేనకు సిద్ధాంతం కానీ, రూపుకానీ లేదని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజా మీడియాతో మాట్లాడారు.

గుడ్ మార్నింగ్‌ సీఎం సర్‌ అంటూ సిఎం జగన్ పై వ్యాఖ్యలు చేస్తే తాము కూడా ఆయనపై కామెంట్స్‌ చేయగలమని, గుడ్‌ మార్నింగ్‌ జనసేన పార్టీ. గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌ టీడీపీ. గుడ్‌ ఈవినింగ్‌ బీజేపీ అని మాట్లాడగలమని రాజా ఎదురుదాడి చేశారు. మొదటి దశలోనే రోడ్ల మరమ్మతులకు సిఎం జగన్ 2,205 కోట్ల రూపాయలు కేటాయించారని, వీటిలో 60శాతం పనులు పూర్తి కూడా చేశామని, ఈలోగా వరదలు వచ్చాయని రాజా వెల్లడించారు.

చంద్రబాబును వీలైనంత త్వరగా సీఎంను చేయాలన్న తాపత్రయం ఆయనలో కనిపిస్తోందని, ఏమైనా అంటే తన పార్టీని ఎక్కడా విలీనం చేయబోనని.. ఎవరికీ అమ్ముడుపోనని అంటారని కానీ చంద్రబాబును సీఎంను చేయాలనే తాపత్రయం తప్ప వేరే ఉద్దేశం కనిపించడం లేదని దుయ్యబట్టారు. అసలు ఆయనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఎంపీ ఉన్నాడా? ఎవరున్నారని,  అయినా ఆయన తన పార్టీని విలీనం చేయబోనని ఎందుకు చెబుతున్నారో అర్ధం కావడంలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *