BJP Aparna: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ వేత్త ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ నేడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ లోని బిజెపి కేంద్ర కార్యాలయంలో యూపీ బిజెపి అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, యూపీ డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సమక్షంలో ఆమె కమల తీర్థం పుచ్చుకున్నారు.
ములాయం రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్. ఇటీవల అధికార బిజెపి నుంచి సమాజ్ వాదీలోకి భారీగా వలసలు జరిగిన నేపథ్యంలో మంచి జోష్ లో ఉన్న ఆ పార్టీ కేడర్ కు ఈ పరిణామం శరాఘాతం గా పరిశీలకులు భావిస్తున్నారు.
అపర్ణా యాదవ్ 2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసి రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో తనకు ఇదే సీటులో పోటీచేసే అవకాశం ఇవ్వాలని అపర్ణా యాదవ్ బిజెపి నేతలకు షరతు విధించినట్లు తెలిసింది. ఈ సీటుపై స్పష్టత ఇచ్చిన తరువాతే ఆమె చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పార్టీలో చేర్చుకున్నందుకు బిజెపి నేతలకు అపర్ణ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ పరిపాలన తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఎప్పుడూ తానూ నేషన్ ఫస్ట్ అనే భావన తోనే ఉంటానని చెప్పారు.
పార్టీ ఆఫీసు నుంచి నేరుగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి ఆమె నేతలతో కలిసి వెళ్ళారు. అక్కడ నడ్డా తో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆమెను పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.
Also Read : ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం