Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందాశరథీ! కవితాపయోనిధీ!- 6

దాశరథీ! కవితాపయోనిధీ!- 6

తెలుగు పాటకు తేనె త్రాగించి .. తెలుగువారి గుండెల్లో అనుభూతుల జే గంట మ్రోగించిన కవి రత్నాలలో దాశరథి కృష్ణమాచార్యులు ఒకరు. కవిగా దాశరథిలో రెండు కోణాలు కనిపిస్తాయి. ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించి, పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించిన పరశురాముడు ఆయన. పడుచుదనంలోకి అడుగుపెట్టిన పాటకు ఊహల రెక్కలు తగిలించినవారాయన. ఒక వైపున విప్లవ కవిత్వం .. మరో వైపున విరహంతో కూడిన పాటలను పలికించిన ప్రత్యేకత దాశరథి సొంతం. తన కలాన్ని ఖడ్గంలా ఉపయోగించిన ఆయన ‘ఒర’లో, గర్జించే కవిత్వం .. గర్వించే పాటలు ఇమిడిపోయాయి.

దాశరథి అప్పటి వరంగల్ జిల్లా ‘చిన్నగూడూరు’లో జన్మించారు. ఇప్పుడు ఈ గ్రామం ‘మహబూబాబాద్’ జిల్లా పరిధిలోకి వచ్చింది. బాల్యంలో దాశరథి విద్యాభ్యాసం అంతా కూడా ఖమ్మం జిల్లా ‘మధిర’లో నడిచింది. మొదటి నుంచి కూడా ఆయనలో కవితావేశం ఎక్కువగా ఉండేది. అలాగే సాహిత్యంపై ఆయనకి విపరీతమైన ఆసక్తి ఉండేది. వివిధ భాషల్లోని సాహిత్యాన్ని ఆయన పరిశీలించారు. తెలుగు సాహిత్యంలోని అనేక అంశాలను తనదైన శైలిలో ప్రభావితం చేశారు. తెలుగుతో పాటు సంస్కృత .. ఆంగ్ల .. ఉర్దూ భాషల్లోను పండితుడు అనిపించుకున్నారు.

నిజాం పాలకుల నియంతృత్వాన్ని నిరసిస్తూ .. తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛను ఆకాంక్షిస్తూ ఆయన ‘అగ్నిధార’ కురిపించారు. ఆ దిశగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో, పదునైన అక్షరాలతో పద్యాలు సంధించారు. దాంతో ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. జైలు గోడలపై బొగ్గుతో పద్యాలు .. నినాదాలు రాస్తూ, తనదైన భావజాలాన్ని భయం లేకుండా బయటపెట్టినవారాయన. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఆయన చేసిన అలుపెరగని పోరాటం ఆయనకి ‘కవి సింహం’ అనే బిరుదును తెచ్చిపెట్టింది.

దాశరథి నుంచి వెలువడిన ‘అగ్నిధార’ .. ‘రుద్రవీణ’ .. ‘తిమిరంతో సమరం’ .. ‘పునర్ణవం’ కవితా సంపుటాలు, తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానంలో నిలిచాయి. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి ‘గాలీబ్ గీతాలు’ పేరుతో అనువదించి అందించారు. అలాంటి దాశరథి ‘ఆకాశవాణి’లో కొంతకాలం పాటు పనిచేశారు. ఆ తరువాత సినిమా పరిశ్రమ దిశగా అడుగులు వేశారు. అప్పటివరకూ ఆయన తీవ్రమైన భావజాలంతో కవితలు రాసినప్పటికీ, సున్నితమైన భావాలతో మనసులను మంత్రించే శక్తి కూడా ఆయనకి ఉందనే విషయాన్ని చిత్రపరిశ్రమ గుర్తించింది.

పాటలు రాయడంలో పరాక్రమవంతుడిగా పేరున్న ఆత్రేయ, దాశరథివారికి అవకాశం ఇవ్వడం విశేషం. ఆత్రేయ ‘వాగ్దానం’ సినిమాకి దర్శకత్వం వహిస్తూ, ఆ సినిమా కోసం దాశరథితో ఓ పాట రాయించారు. ‘నా కంటి పాపలో నిలిచిపోరా .. నీ వెంట లోకాలు గెలువనీరా’ అంటూ దాశరథి రాసిన పాట, అప్పటికీ ఇప్పటికి మధురమైనదే .. మరువలేనిదే. అదే సమయంలో ‘ఇద్దరు మిత్రులు’ సినిమా కోసం ఆయన రాసిన ‘ఖుషీఖుషీగా నవ్వుతూ’ అనే హుషారైన పాట కూడా జనంలోకి దూసుకుపోయింది. ఇక అప్పటి నుంచి పాటల పడవలో ఆయన ప్రయాణం మొదలైంది.

దాశరథి అనగానే ఎవరికైనా గుర్తుకువచ్చేది ఆయన రాసిన వీణ పాటలు. అప్పట్లో వీణ పాట రాయాలంటే .. దాశరథివారే అన్నట్టుగా ఆయన ముందు వాలిపోయేవారట. ‘మదిలో వీణలు మ్రోగే’ (ఆత్మీయులు) .. ‘నేనె రాధనోయి గోపాలా’ (అంతా మనమంచికే) .. ‘మ్రోగింది వీణ పదే పదే’ (జమిందారుగారి అమ్మాయి) ఇలా అప్పట్లో ఆయన రాసిన ప్రతి వీణ పాట హిట్టే  .. మనసు కొమ్మను హత్తుకుపోయిన తేనె పట్టే. మెలోడీ గీతాలను రాయడంలోనూ దాశరథి తనకి తిరుగులేదనిపించుకున్నారు. ‘గోదారి గట్టుంది .. గట్టుమీద చెట్టుంది'(మూగమనసులు) అంటూ ఆంధ్రదేశాన ఆయన చేసిన సందడి ఇంతవరకూ తగ్గలేదు.

ఇక ఆయన రాసిన మధురమైన మెలోడీలు విన్న తరువాత, పంచదార గుళికలు .. పనస తొనలు కూడా చప్పగానే అనిపిస్తాయి. ‘కన్నెవయసు’ సినిమా కోసం ఆయన రాసిన ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అనే పాట, ఇప్పటికీ యూత్ హృదయాలను కొల్లగొడుతూనే ఉంది. ప్రేమ .. ఆరాధన భావాలను కలగలిపి కమనీయంగా ఆవిష్కరించిన ఈ పాటను, ఇంతవరకూ మరోపాట దాటలేకపోయింది. ఎన్నోవేల పాటలను పాడిన బాలు, తనకి చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అని చెప్పడాన్ని బట్టి, ఈ పాట ప్రత్యేకత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

‘ఒక పూల బాణం’ (ఆత్మగౌరవం) .. ‘ఏ శుభసమయంలో .. ఈ కవి హృదయంలో( మనసు మాంగల్యం) .. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ’ ( పూజ) .. ‘జాబిల్లి చూసేను నిన్ను నన్ను’ (మహాకవి క్షేత్రయ్య) .. ‘గోరంక గూటికే చేరావే చిలకా'( దాగుడు మూతలు) .. ఇలా ప్రేమ .. విరహం .. ఒంటరితనంతో వేదనచెందే మనసుకు ఓదార్పు నిచ్చే పాటలతో పాటు, పరవళ్లుతొక్కే హుషారైన పాటలు కూడా రాశారు. ఇక తేలికైన పదాలతోనే భక్తి పాటలను కూడా రాయడం ఆయనలోని మరో ప్రత్యేకత. అలాంటి భక్తి పాటల జాబితాలో .. ‘నడిరేయి ఏ జాములో'(రంగుల రాట్నం ) .. ‘రారా కృష్ణయ్య’ (రాము) .. ‘నను పాలింపగా నడిచి వచ్చితివా'( బుద్ధుమంతుడు) మొదలైనవి కనిపిస్తాయి.

ఇలా దాశరథి సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే పద్యాలతో పాటు, పరవశింపజేసే పాటలను కూడా లక్షలాది హృదయాల్లో వెదజల్లారు. ఒక వైపున శ్రీశ్రీ .. ఆరుద్ర .. ఆత్రేయ .. సినారె వంటి కవులు విజృంభిస్తున్న కాలంలో, దాశరథి తనదైన శైలితో తన కలాన్ని పరిగెత్తించారు. అక్షరాలు గర్వించే పదునైన మాటలతో పద్యాలు రాసే మండే సూర్యుడిగా, ఊహల ఉద్యానవనంలో వెన్నెల వెదజల్లే పున్నమి చంద్రుడిగా మనసు .. మనసును ఆక్రమించారు. అలాంటి దాశరథి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.

రేపు:-
“భక్తిలో కమ్యునిజం”

-పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్