Abdul Kalam .. The Great: భారత రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ పదవిని అత్యంత సమర్ధంగా నిర్వహించి, అతి సామాన్య జీవితాన్ని గడిపి యావత్ జాతి అభిమానాన్ని సంపాదించుకొని, నేటికీ ఆ పదవి గురించిన ప్రస్తావన రాగానే ఠక్కున గుర్తొచ్చే మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గురించిన కొన్ని విషయాలు…..
కలాం గారి గురించి పరిశోధన చేసిన ఓ మిత్రుడు కలాం గురించి కొన్ని విషయాలు పంపాడు. అవి చదువుతుంటే తెలుగులో అనువదించాలనిపించింది. ఇక్కడ చెప్పిన విషయాలు అంతకుముందే ఎవరికైనా తెలిసి ఉండొచ్చు. నాకైతే తెలిసిన మంచి విషయం మరొక్కసారి తెలుసుకోవడం తప్పు కాదేమో…. కాలాన్ని వృధా చేసుకోవడమూ అవదని నా వ్యక్తిగత అభిప్రాయం….
కలాంగారితో పాటు తిరుచ్చీ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒకే గదిలో నాలుగేళ్ళు సంపత్ కుమార్ అనే అతను ఉన్నారు. వీరిద్దరితోపాటు అలెగ్జాండర్ అనే అతనుకూడా అదే గదిలో ఉన్నారు. వీరి ముగ్గురి మతాలు వేర్వేరు. అయినప్పటికీ ఒకే గదిలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలేజీ రోజుల్లో కలాంగారిని “కలాం అయ్యర్” అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన ముస్లిం అయినప్పటికీ శాకాహారమే తీసుకునేవారు. మాంసాహారానికి బహుదూరం. అంతేకాకుండా కాలేజీలో శాకాహార శాఖకు ఆయన కార్యదర్శిగానూ ఉండేవారు. ఆయనకు బొబ్బట్లంటే మహా ఇష్టమట.
గుజరాత్ లో 2001లో భూకంపం వచ్చినప్పుడు మూడు వందల యాభై మంది కాళ్ళు కోల్పోయారు. అప్పుడు వాళ్ళందరికీ ఆయన కృత్రిమ కాళ్ళను సమకూర్చారు. ఆయన దగ్గరుండి బాధితులందరికీ కృత్రిమ అవయవాలు ప్రదానం చేశారు.
డి.ఆర్.డి.ఓ పరిధిలోని ఓ స్కూల్లో సంగీత టీచరుగా పని చేసిన కళ్యాణి వారి మాటల్లో…
ఓమారు స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమానికి అబ్దుల్ కలాంగారిని ఆహ్వానించాను. అదే ఆయనతో తొలిసారి పరిచయం. ఓ శనివారంనాడు నేను సంగీతపాఠాలు చెప్తున్న తరగతికి వచ్చారు. నాకూ వీణ నేర్చుకోవాలనుంది. నేర్పిస్తారా అని అడిగారు. మీరో మాట చెప్పి ఉంటే నేనే మీ వద్దకు వచ్చేదానిని కదాని అన్నాను. అయితే కలాంగారు గురువుని వెతుక్కుంటూ శిష్యుడు వెళ్ళడమే సరైన పద్ధతి అన్నారు. నిజానికి ఆయన కంటే వయస్సులో చాలా చిన్న దానిని. కానీ ఆయన నన్నొక గురువుగా భావించి మర్యాదివ్వడం ఎప్పటికీ మరచిపోలేనని కళ్యాణి తెలిపారు. 1989 ఆగస్టు నుంచి 1992 డిసెంబరు వరకూ దాదాపు మూడున్నరేళ్ళు వీణ వాయించడం నేర్పించాను.
త్యాగయ్య కీర్తనలలో శ్రీరాగం ఆయనకెంతో ఇష్టం. ఎంతో ఆనందంలో ఉన్నప్పుడు, అలాగే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆయన వీణ వాయించేవారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గొంతు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎం.ఎస్. పాడుతున్నట్టు ఉండదు. భగవంతుడితో మాట్లాడుతున్నట్టు ఉంటుందనేవారు. మహాత్మాగాంధీ తర్వాత ఆయనకు సాటి ఎవరంటే అది అబ్దుల్ కలాం మాత్రమే నావరకూ. ఖురాన్ మాత్రమే కాకుండా బైబిల్, భగవద్గీత, తమిళులు దక్షిణ వేదంగా భావించే తిరుక్కురళ్ ఆయన ఎప్పుడూ చదువుతుండేవారు. ఆయన ఏదీ ఉచితంగా తీసుకునేవారు కాదు. వీణ నేర్చుకుంటానని చెప్పినప్పుడు నేను వీణ కొనిస్తానని అంటే అందుకు ఆయన ఒప్పుకోలేదు. ఆయనే కొనుక్కున్నారు. కానీ ఆయన నా చేతులతో అందుకుని ఓ బంగారు ఆభరణాన్ని కాపాడుకున్నట్టుగా వీణను చూసుకున్నారు. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలిసినవారే నేత కాగలరనేది ఆయన నమ్మకం. నా దేశ యువత సమస్యలను అధిగమించడం తెలుసుకోవాలని ఆశించేవారు. సాధారణ మనిషిగా పుట్టి శిఖరాన్ని అధిరోహించిన అసాధారణ మనిషి ఆయన.
రాష్ట్రపతి భవన్లో అయిదు వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ పథకాన్ని ఆయన నెలకొల్పాలనుకున్నారు. అందుకు ప్రణాళికనూ రూపొందించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ అది నెరవేరినట్లయితే సుప్రసిద్ధ మొగల్ గార్డెన్సుకి నష్టం జరుగుతుందని పర్యావరణ శాఖ అందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ సోలార్ ఎనర్జీ నెలకొల్పడం వల్ల పర్యావరణం దెబ్బతినదని ఆయన ఆధారపూర్వకంగా వివరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగిసిపోయింది.
1963 నుంచీ 1984 వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆయన తిరువనంత పురంలోని తుంబా రాకెట్ కేంద్రంలో పని చేశారు. అప్పుడు ఆయన గాంధారి అమ్మన్ ఆలయం పక్కనే ఉన్న ఓ హోటల్లోనే భోజనం చేసేవారు.
కలాంగారి గురించి పరమేశ్వరన్ నాయర్ మాట్లో….
అబ్దుల్ కలాంగారు ఎక్కువ మాట్లాడరు. చూడగానే ఓ నవ్వు నవ్వేవారు. ఆ నవ్వులో ప్రేమ ఉంటుంది. ఓరోజు వర్షం కురుస్తోంది. నేను ఆ వర్షాన్ని చూసి ఆస్వాదిస్తున్న సమయంలో కలాంగారు వచ్చారు. ఆయన వేసుకున్న మామూలు చెప్పుల నుంచి వర్షంనీటిని విదిల్చి మెల్లగా అడుగేస్తూ వచ్చారు. ఆయనన చంకలో గొడుగు ఉంది. అది ఉన్న విషయం మరచిపోయి నడచివచ్చారు. ఆయన ధ్యాసంతా పరిశోధనమీదే ఉండేది. మా హోటలుకి వచ్చేటప్పుడు ఆయన నడకలో వేగం ఉండేది. ఏదో పనిమీద తొందర ఉన్నట్టు కనిపించేవారు. ఉదయం అప్పం తిని పాలు తాగేవారు. రిత్రి పూట నెయ్యి దోశ తిని పాలు తాగేవారు. ఆయన రాష్ట్రపతి అయ్యాక ఆయన ఆహ్వానం అందుకుని నేనూ నా భార్యా రాష్ట్రపతి భవన్ కి వెళ్ళాం. ఆయనకు ఎంతో ఇష్టమైన నీలంరంగు బట్టలు కొని తీసుకువెళ్ళాం. వాటిని తాకి నమస్కరిస్తూ మాకే ఇచ్చేసారు.
రాష్ట్రపతి భవన్లో పద్దెనిమిది సంవత్సరాలు పని చేసిన జె. కె. సహా మాటల్లో…
ఒకరోజు అబ్దుల్ కలాం ఒక పేరు చెప్పి ఇంటర్ కాంలో ఫోన్ లో కలపమన్నారు. మామూలుగా అయితే రాష్ట్రపతి వ్యక్తిగత కార్యదర్శే అటువంటి పనులు చేస్తారు. కానీ నేనెప్పుడూ అప్పటివరకూ అలాటి పని చేయలేదు. ఆయన చెప్పిన పేరు నాకు అర్థం కాలేదు. కనుక ఆయన దగ్గరకే వెళ్ళి నా సందేహాన్ని తీర్చుకోక మరొకరిని అడిగి ఆయన ఫోన్ లైన్ కలిపి ఇమ్మన్న వ్యక్తి నెంబర్ డయల్ చేసి ఇచ్చాను. కాస్సేపు తర్వాత ఆయన మళ్ళీ ఇంటర్ కాంలోకొచ్చి “మీకు నేను చెప్పింది అర్థం కాలేదంటే నన్నే అడగొచ్చు. దేనికీ జంకకండి” అని ఆయన అన్నప్పుడు నేను విస్తుపోయాను.
అదే రాష్ట్రపతి భవన్లో పని చేసిన డి.కె. సాహా అనే ఆయన మాటల్లో….
రాష్ట్రపతి భవన్లో అయిదేళ్ళపాటు ఉన్న కలాంగారు ఒకే ఒక్కసారి ఆయన కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు.
అప్పుడు వారికైన ఖర్చంతా ఆయన తన సొంత డబ్బులోంచే పెట్టారు. అంతేతప్ప ప్రభుత్వ సొమ్ము ఒక్క పైసా వాడలేదు.
ఇక వంట మనిషి సలీం అహ్మద్ మాటల్లో…
కలాంగారికి దక్షీణ భారత వంటకాలే ఎంతో ఇష్టం. కానీ ఎప్పుడూ ఫలానా వండిపెట్టు అని అడిగేవారు కాదు. అలాగే చేసిపెట్టిన వంటకాలలో ఏ లోటూ చెప్పిందిలేదు. అది బాగా లేదు ఇది బాగాలేదు అని అనేవారు కాదు.
ఆయన రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లోనే 370 ఎకరాల రాష్ట్రపతి భవన్ లోకి జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. మరే రాష్ట్రపతి హయాంలోనూ అంత మంది రాలేదక్కడికి. అక్కడికొచ్చిన వారిలో చాలామంది అతిథులు, విద్యార్థులు. ఆయనను కలిసిన వారిలో అధిక శాతం మంది టచ్ లోనే ఉండేవారు. ఆయన తనకొచ్చిన ఉత్తరాలకు తప్పనిసరిగా ప్రత్యుత్తరం రాసేవారు. పోల్లలు రాసిన ఉత్తరాలకైతే ఇక ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పిల్లలంటే అంత ప్రేమ. ఆయన ఏదన్నా ఓ ఊరుకి వెళ్తున్నారంటే అక్కడ ఏదో ఒక విద్యాలయంలో తప్పనిసరిగా విద్యార్థులతో మాట్లాడేవారు.
ఆయనతో యాభై ఏళ్ళ సాన్నిహిత్యం ఉన్న వై. ఎస్. రాజన్ మాటల్లో…
అహ్మదాబాదులో విక్రం సారాభాయ్ పరిశోధనా కేంద్రంలో ఆయన పని చేస్తున్న రోజుల్లో మొదటిసారిగా ఆయనను కలిశాను. అప్పట్లో నేనూ అక్కడ పని చేసేవాడిని.ఆయన నాకన్నా పన్నెండేళ్ళు పెద్ద. నాకు 21 ఏళ్ళు. ఆయనకు 33 ఏళ్ళు. తొలి పరిచయం మొదలుకుని సర్వీసులో ఉన్నంత కాలమూ నా ప్రతి ప్రయత్నంలోనూ ఆయన సహకారముండేది.
కరూర్ జిల్లా తంజై అవరక్కురిచ్చిలో తంజై తమిళ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్స్ లర్ సి. సుబ్రమణి నిర్వహించిన ఆర్ముగం అకాడమీ స్కూల్లో 2016 జూలై 18వ తేదీన జరిగోన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో మొదటి రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రశంసించి ఆయన బహుమతులు ఇచ్చారు. ఆ తర్వాత దిండుకల్లులో ఉన్న ఆయన గురువు చిన్నదురైని కలిసారు. అలాగే ఆ పర్యటనలోనే మదురైలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
జీవితాంతం ఉన్నత విలువలతో, అత్యంత సామాన్యంగా, ఎలాంటి వివాదాలు దరి చేరనీయకుండా యావత్ జాతి అభిమానాన్ని సొంతం చేసుకున్నా కలాం లాంటి వ్యక్తులు ఎప్పుడో ఎక్కడో ఒకసారి పుడతారు. అయన మన కాలంలో, మనమెరిగిన వ్యక్తిగా ఉండడం మనందరి అదృష్టం.
– యామిజాల జగదీశ్
Also Read :