కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లను ఏకపక్షంగా నియమిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టు ఇవాళ భారీ షాక్ ఇచ్చింది. కేంద్రం ఇలా ఎన్నికల కమిషనర్లను నియమించడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రధాని, విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలని ఆదేశించింది. ప్రధాని,విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాతో ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. పార్లమెంటు ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఓ చట్టం చేసే వరకూ ఈ విధానం అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకు సుప్రీంకోర్టు ముందుకు వచ్చే ఏ సలహా అయినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును జస్టిస్ కేఎం జోసెఫ్ ప్రకటించారు.
దేశంలో ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని కేంద్రం ఏకపక్షంగా చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్ తో కూడిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమగ్రంగా విచారణ జరిపింది. తాము నిష్పక్షపాతంగానే కమిషనర్లను ఎంపిక చేస్తున్నట్లు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంతే కాదు దేశంలో ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కలిగించాలంటే ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రధాని, విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ సలహా అవసరమని స్పష్టం చేసింది.
మరోవైపు సీఈసీ నియామకం విషయంలోనూ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీఈసీల నియామకంలోనూ మరింత పారదర్శకత అవసరమని సుప్రీంకోర్టు తెలిపింది. సీబీఐ ఛీఫ్ తరహాలోనే సీఈసీ, ఈసీల నియామకాలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. సీఈసీ నియామక కమిటీలోనూ ప్రధాని, విపక్ష నేత, సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఉండాలని తెలిపింది.