కొన్ని వార్తలు వినడానికి ఇబ్బందిగా ఉంటాయి. మనసులో ఎక్కడో గుచ్చుకున్నట్లుంటుంది. అలా జరక్కుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వార్త ఇది.
జపాన్ లో ఒంటరి వృద్ధులు ఎక్కువై…ఏ తోడూ నీడా లేక, ఎలా బతకాలో తెలియక…ఏ నేరం చేస్తే జైల్లో వేస్తారో తెలుసుకుని…ఉద్దేశపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా ఆ నేరాలు చేసి…పట్టుబడి…జైళ్ళకు వెళుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేనివారు దొంగతనాలు చేసి జైలులో భద్రజీవితం కోరుకోవడమే ఒక విషాదమైతే…డబ్బున్నవారుకూడా అనాథలై…డబ్బు చెల్లించి మరీ జైలుజీవితాన్ని కోరుకుంటున్నారు. ఇలా ప్రయత్నంతో జైలుపాలవుతున్నవారిలో పురుషులకంటే మహిళలే అధికంగా ఉన్నారు.
దీనికి కారణాలు ఊహించడం చాలా సులభం. అందరికీ తెలిసినవే. కానీ తెలియనట్లు నటించేవి.
జపాన్ లో ఒంటరి మహిళలు పెరగడానికి కారణాలు:-
- పేదరికం
- తల్లిదండ్రులను పోషించలేని పిల్లలు
- పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం
- 2022 నుండీ ఈ సమస్య మరింత పెరిగింది.
- ప్రస్తుతం జైళ్ళలో ఉన్న 65ఏళ్ళు పైబడ్డ మహిళల్లో 80 శాతం ఇలా జైళ్ళలో ఉండడంకోసం తెలిసి దొంగతనాలు చేసి వచ్చినవారే. వీరందరూ ఒంటరి మహిళలే.
- జపాన్ లో వృద్ధుల ఆలనా పాలనా చూసుకునే కేర్ టేకర్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండు. తక్షణం 30 లక్షల మంది సుశిక్షితులైన కేర్ టేకర్లు కావాలి. ఇదో పెద్ద వ్యాపార అవకాశమట సర్వీస్ సెక్టార్ పరిశ్రమకు.
“విశ్వామిత్రా హి పశుషు
కర్దమేషు జలేషు చ
అంధే తమసి వార్ధక్యే
దండం దశగుణం భవేత్”
పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువుల దగ్గర; బురదలో, నీటిలో, గుడ్డితనంలో, చీకటిలో, ముసలితనంలో- ఇలా పదిరకాలుగా దండం(కర్ర) ఉపయోగపడుతుందని అనుభవపూర్వకంగా శాస్త్రం సిద్ధాంతీకరించింది. అయితే శ్లోకంలో పై మూడు పాదాలను గాలికొదిలేసిన లోకం…“దండం దశగుణం భవేత్” అన్న చివరి నాలుగో పాదాన్ని మాత్రం పట్టుకుని- దండనే అన్నిటికీ పరిష్కారమని దౌర్జన్యంగా దురర్థాన్ని సాధించింది!
వెన్ను విరిగిన ముసలితనానికి ఊతకర్ర(దండం) సాయం చాలడం లేదని;
రాలిపోయే తుది సంధ్య పాడుకోలేని ఒంటరి రాగమయ్యిందని;
రెక్క తెగిన జీవితానికి జైలు గూడే దిక్కవుతుందని;
వాలిన పొద్దుల్లో, రాలిన ఆశల్లో తోడులేని గోడు జనారణ్యరోదన అవుతుందని- జపాన్ చెబుతున్న ముడుతలుపడ్డ పాఠం.
ప్రస్తుతం జపాన్, కొరియా. రేప్పొద్దున భారత్ లో అయినా ఇంతే.
అన్నట్లు-
జనవరి 21 ప్రపంచ గ్రాండ్ మదర్స్ డే అట!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు