ఐపీఎల్ లో నేడు శనివారం జరిగిన రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగులతో ఘన విజయం సాధించింది. లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి ఏక్తా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
కేల్ మేయర్స్ 38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73 పరుగులతో విధ్వంసం సృష్టించాడు, నికోలస్ పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36; అయూష్ బదోనీ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 18 రన్స్ తో రాణించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది.
ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు; అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఢిల్లీ తొలి వికెట్ కు 41 పరుగులు చేసినా… 7 పరుగుల తేడాతో మొత్తం మూడు వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్ డకౌట్ కాగా, సర్ఫ్ రాజ్ అహ్మద్ -4; పృథ్వీ షా-12 రన్స్ చేసి ఔటయ్యారు. ఈ మూడు వికెట్లూ మార్క్ వుడ్ కే దక్కాయి. కెప్టెన్ డేవిడ్ వార్నర్ -56; రీలీ రోస్సో-30; అక్షర్ పటేల్ -16 పరుగులు చేశారు, 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయగలిగింది.
మార్క్ వుడ్ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టగా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.
మార్క్ వుడ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.