Saturday, November 23, 2024

లవణ పురాణం

Salt: Health Complications
మానవ శరీరం అనేక చిన్నచిన్నయంత్రాలతో కూడిన ఒక పెద్దయంత్రం.

గుండె, మూత్రపిండాలు, కాలేయం, జీర్ణాశయం, కళ్ళు, చెవులు.. ఒక్కటేమిటి ప్రతిదీ ఒక్కో చిన్నయంత్రంలాంటివే

శరీరంలో ఏ యంత్రానికి ఆ యంత్రం బ్రతికి-బట్టకట్టి తమ పని తాము చేయాలంటే..కాస్త వాటికి కావల్సిన ఇంధనాన్ని ఇవ్వాలి.  కాబట్టి  రోజుకు రెండు-మూడు సార్లు లేదా కనీసం ఒకసారన్నా కాస్తో-కూస్తో ఆహారం వేయక తప్పదు.

ఆదిమానవుడు.. ఆకులు, అలమలు, కందమూలాలు వేసి ఈ శరీర యంత్రాన్ని నడిపిస్తే..

మానవ జాతి రాను రాను ఆ ఆహారాన్ని కాల్చుకు తినడం, నానబెట్టి తినడం, ఊరవేసి తినడం, నూరుకొని తినడం, ఉడకబెట్టి తినడం, వేయించుకు తినడం, బాగా వేయించుకొని తినేవరకు అభివృద్ధి చేశాడు.

తరువాత ఆహారాన్ని నానబెట్టి-ఉడకేయడం, నానబెట్టి-ఉడకేసి-వేయించడం, కాల్చి-నూరడం, కాల్చి-నూరి-వేయించడం వంటి రకరకాల  మిశ్రమ ప్రయోగాలు కూడా ఆహారం మీద చేశాడు.

Salt

నిజానికి ఈ శరీర యంత్రానికి ఇంధనం కాల్చి ఇవ్వమనో, నూరి ఇవ్వమనో, వేయించి ఇవ్వమనో పాపం ఈ శరీర యంత్రం చెప్పదు.  తాను జీర్ణం చేయగలిగేది దాంట్లో వేస్తే అదే దాన్ని మెతగ్గొట్టి, అరగదీసి ఇంధనంగా  మార్చుకొని తనలో ఉన్న చిన్న చిన్నయంత్రాలకన్నింటికి అదే గొట్టాల ద్వారా పంపుకొంటుంది.

అయితే ఆహారాన్ని అలా ముడిపదార్ధంగా కడుపులోకి చేర్చకుండా..దానిని రకరకాలుగా ఏమార్చి అందించవలసిన అగత్యం మానవుడికి ఏర్పడడానికి కారణం మన ‘నాలుక’.

ఇది రెండువైపులా పదునున్న కత్తి. దీనికి అన్నిరుచులూ కావాలి. 

గట్టిగా మూడు అంగుళాల పొడవు కూడా ఉండని ఈ నాలుక కారణంగా ముడి ఆహారాన్ని రూపాంతరం చెందించి, ఇతర పదార్ధాలతో మిశ్రితం చేసి, రసోపేతం చేసి, సుగంధభరితం చేసి అందించవలసిన అవసరం మానవుడికి ఏర్పడింది.

ఏ ఆహారం అయినా ఈ మూడంగుళాల నాలుక దాటిందా..ఇక దాని రుచి మనకు తెలియదు.

ఇక ఈ నాలుకను సంతృప్తి పరచడానికే మానవుడు నిరంతరం నానా పాట్లు పడి నానా గడ్డి తింటాడు.

ఆహారాన్నిభక్ష్యాలు (కొరికి తినేవి), భోజ్యాలు(నమిలి తినేవి), లేహ్యాలు (చప్పరిస్తూ తినేవి), పానీయాలు (తాగేవి), చూష్యాలు (పీల్చి తాగేవి) గా మార్చి దానికి అందిస్తాడు.

ఇక వీటికి రుచులు అద్ది ‘షడ్రసోపేతం’ చేశాడు. అంటే మధురం (తీపి), ఆమ్లం(పులుపు), లవణం (ఉప్పు), కటువు (కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు). ఇక మళ్ళీ వీటి మిశ్రమాలు అనేకం అనుకోండి.  ఇక ముడి ఆహారాన్ని ఇలా షడ్రసోపేతం చేయడానికి దానికి రకరకాల దినుసులు, సుగంధద్రవ్యాలు వంటివి జోడించి ఆహారాన్నిసుగంధభరితం కూడా చేసుకొన్నాడు. దీని కోసం ఒక పాకశాస్త్రాన్నే రచించి, ఈ పాక శాస్త్ర ప్రవీణులను “నల-భీము” లను చేశాడు.

అసలు వంటలు, వాటిలో రకాలు వాటి సుగంధం గురించి తెలుకోవాలంటే  శ్రీనాధుడి “గుణనిధి” ని అడగాలి.  ధర్మభ్రష్టుడైన గుణనిధి ఒకరోజు ఆహారం కోసం ఒక శివాలయంలో దూరి అక్కడ నైవేద్యం కోసం పెట్టబడిన వంటకాలను చూస్తాడు.  ఆ వంటకాలు ఎలా ఉన్నాయని శ్రీనాధుడి మాటల్లో చదవండి.

“మరీచి ధూళీ పాళి పరిచితంబులు మాణి/బంధాశ్మ లవణ పాణింధమములు
బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు/పటురామఠామోద భావితముల
తింత్రిణీక రసోపదేశ దూర్ధురములు/జంబీర నీరాభి చుంబితములు
హైయంగవీన ధారాభిషిక్తంబులు/లలిత కస్తుంబరూల్లంఘితములు

శాకపాక రసావళీ సౌష్టవములు
భక్ష్యభోజ్య లేహ్యంబులు పానకములు
మున్నుగా గల యోగిరంబులు సమృద్ధి
వెలయగొని వచ్చె నొందొండ విధములను”

మరీచి ధూళి పాళి పరిచితాలు అంటే  మిరియాలపొడి చల్లి తయారు చేసిన ఆహారం అంటే కారంగా ఉండేవి.  మాణిబంధాశ్మ లవణ పాణింధమములు అంటే సైంధవలవణం/ఉప్పు. పాణింధమం అంటే చేతులతో నొక్కి చేసిన పిండివంట. అంటే పిండిలో తగినంత ఉప్పు వేసి ముద్దగా కలిపి చేతులతో వత్తి కాల్చిన  తప్పాలచెక్క లాంటివి. బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు: సిద్ధార్ధం అంటే ఆవాలు. జంబాలం అంటే ఇప్పటి భాషలో గ్రేవీ.  అంటే ఆవపిండి గ్రేవీ ఎక్కువగా ఉండే ఆవడల్లాంటి వంటకాలు. పటు రామఠామోద భావితములు అంటే బాగా నాణ్యమైన ఇంగువ ఘుమాయించే వంటకాలు. తింత్రిణీక రసోపదేశ దూర్ధురములు: చింతపండు రసం బాగా కలిపి చేసిన వంటకాలు. జంబీర నీరాభి చుంబితములు అంటే నిమ్మరసం పిండిన వంటకాలు. హైయంగవీన ధారాభిషిక్తంబులు: హైయంగవీనం అప్పుడే పెరుగును చిలికి తీసిన వెన్నను కరిగించిన నేతిలో మునిగితేల్తున్న వంటకాలు. లలిత కస్తుంబరూల్లంఘితములు అంటే లేత కొత్తిమీర లేదా అలా పరిమళించే పదార్ధాలు కలిపిన వంటకాలు.

శాకపాక రసావళీ సౌష్టవములు అంటే మంచి సౌష్టవం కలిగిన కూరగాయలతో చేసిన రుచికరమైన కూరలు.  భక్ష్యభోజ్య లేహ్యంబులు పానకములు: భక్ష్యాలు (కొరికి తినవలసిన పిండివంటలు), భోజ్యాలు (నమిలి మింగవలసిన అన్నమూ, కూరలు వగైరా), లేహ్యాలు (చప్పరిస్తూ తినవలసిన హల్వా, కేసరి లాంటివి), చోష్యాలు(చూష్యాలు-పీలుస్తూ సేవించే పులుసు చారు వగైరా), పానీయాలు(పాయసాలు, సూపు వగైరా).

ఈ వంటలలో రకాలను వర్ణించడానికి శ్రీనాధుడికి, ఆటవెలదులు, తేటగీతులు, కందాలు పక్కన బెట్టండి, ఉత్పలమాలలు, చంపకమాలలు, మత్తేభాలు, శార్ధూలాలు వంటి వృత్తాలు కూడా సరిపోక సీసం ఎత్తుకోవలసి వచ్చింది. 

చూశారా.. ఈ మూడంగుళాల నాలుక కోసం మన తిప్పలు.

దానికి నచ్చే ఆహారం ఇవ్వడానికి ఇంత శాస్త్రమే పుట్టింది.

అయితే  ఆహారాన్ని ఇలా షడ్రసోపేతం చేయడంలో అతి ముఖ్య పాత్ర లవణానిది. అంటే ఉప్పుది.

ఈ ఉప్పు కొద్దిగా ఎక్కువ అయినా, లేదా కొద్దిగా తక్కువ అయినా.. నాలుక నానా రభసా చేస్తుంది. ఆహారాన్ని తీసుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోదు.

అందుకే “పదనుగ మంచి కూర నల పాకము చేసిననైన నందు నింపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా” అని భాస్కర శతక కర్త మొత్తుకొన్నాడు. ఇక మన వేమన కూడా “ఉప్పులేని కూర యెప్పుదు రుచులకు అని తేల్చి చెప్పాడు.

అయితే ఈ ఆహారాన్ని ఇలా రుచికరం గా మార్చే ప్రయత్నంలో మానవుడు కొత్త, కొత్త ప్రయోగాలు చేసి చివరకు దానికి మన శరీర యంత్రం జీర్ణించలేని స్థితికి తీసుకొచ్చాడు.  దాంతో అది శరీరంలో చిన్న, చిన్న యంత్రాలకు కావల్సిన ఇంధనాన్ని సరఫరా చేయలేక నానా ఇబ్బందులు పడుతోంది.  దాంతో ఆ యంత్రాలన్నీతరచూ మొరాయిస్తున్నాయి. దాంతో వాటి మరమత్తులకు నానా రకాల మరమత్తుదార్లు పుట్టుకొచ్చారు.  అంటే డాక్టర్ లన్నమాట.

గుండెకొకడు, మూత్రపిండానికొకడు, కాలేయానికొకడు, కన్నుకొకడు, చెవికొకడు,కాలుకొకడు, చెయ్యికొకడు..

తీపి తక్కువ తిన్నవాడికొకడు, ఉప్పు ఎక్కువ తిన్న వాడికొకడు,

తినవలసినది తినని వాడికొకడు..తినకూడనిది తిన్నవాడికొకడు.. అబ్బో చెప్పుకొంటే చాంతాడంతమంది.

ఇక ఈ మరమత్తుదార్లు అంతా ఇప్పుడు మూకుమ్మడిగా చెప్పేది ఏమంటే.. ఉప్పుతో పరాచికాలు ఆడొద్దని.

“లక్షాధికారి అయినా లవణమన్నమే గాని మెరుగు బంగారం మింగలేడని” అనుకొంటూ అయిన కాడికి ఉప్పును అదేపనిగా మింగకూడదట.

Salt

జిహ్వాచాపల్యం తీర్చడం కోసం ఆహారానికి కలిపే అనేక పదార్ధాలలో “ఉప్పు” ముఖ్యమైనదే అయినప్పటికీ దీన్ని అతిగా వాడడం వల్ల శరీరంలో అనేక యంత్రాలు తరచూ మొరాయించి, అస్తవ్యస్తంగా పనిచేసి అసలు శరీర యంత్రాన్నే మూలపడేస్తాయని ముక్త కంఠంతో చెపుతున్నారు.

కాబట్టి కాస్త ఉప్పు విషయంలో మన జిహ్వచాపల్యాన్ని కాస్త తగ్గించుకొంటేనే మనం ఈ భూమ్మీద కాస్త ఎక్కువ కాలం బ్రతికి బట్టకట్టగలం. లేదంటే మనకు నూకలు చెల్లుతాయి. జాగ్రత్త.

– శ్రీ వెంకట సూర్య ఫణి తేజ  

Also Read :

అతి చేస్తే గతి చెడుతుంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్