Sunday, September 29, 2024
HomeTrending Newsఅసదుద్దీన్ ఒవైసీకి చుట్టుకుంటున్న పాలస్తీనా నినాదం

అసదుద్దీన్ ఒవైసీకి చుట్టుకుంటున్న పాలస్తీనా నినాదం

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తర్వాత జై పాలస్తీనా అని నినదించడంతో లోక్‌సభలో కలకలం రేగింది. దీనిపై ఇద్దరు న్యాయవాదులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆర్టికల్ 103 ప్రకారం ఒవైసీపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతిని కోరినట్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఎక్స్ లో వెల్లడించారు. పార్లమెంటులో మరో దేశాన్ని కీర్తిస్తూ జై కొట్టినందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్టు పేర్కొన్నారు.

పాలస్తీనా పట్ల విధేయత చూపినందుకు ఆర్టికల్ 102 (4) ప్రకారం అసదుద్దీన్ ఒవైసీని అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టు న్యాయవాది హరిశంకర్ జైన్ కూడా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఒవైసీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టికల్ 102 (D) ప్రకారం, సభ్యుడు ఒక విదేశీ రాష్ట్రానికి విధేయతగా ప్రతిజ్ఞ చేస్తే, అతని సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 ప్రకారం, ఆర్టికల్ 102 కింద ఎవరైనా అనర్హులు అని తేలితే, ఆ ఎంపీ సభ్యత్వంపై రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారని న్యాయవాది వివరించారు.

లోక్ సభలో అసదుద్దీన్‌ వ్యవహారంపై పలువురు మంత్రులు, బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్‌ సింగ్‌ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం ఒవైసీ లోక్‌సభకు అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీని తర్వాత స్పీకర్ అతని నినాదాన్ని రికార్డు నుండి తొలగించారు.  మరోవైపు తన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఒవైసీ సమర్థించుకున్నారు. జై పాలస్తీనా అంటే తప్పేంటని ప్రశ్నించారు. ‘‘ప్రమాణస్వీకారం సందర్భంగా అందరూ ఏదో ఒక నినాదం చేశారు. నేను కేవలం జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అన్నాను. ఇది ఎలా రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది? అలాంటి నింబంధన ఏదైనా ఉంటే చూపాలని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సభా నిబంధనలకు విరుద్ధంగా అసదుద్దీన్ వ్యవహరించారని విమర్శించారు. పార్లమెంట్‌లో ‘జై పాలస్తీనా’ నినాదం చేయడం పూర్తిగా తప్పని, సభా నిబంధనలకు విరుద్ధమన్నారు. భారత్‌లో ఉంటూ ‘భారత్ మాతాకీ జై’ అనరు కానీ రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసే ఒవైసీ తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

అయితే ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ లోక్‌సభలో మరోసారి ప్రమాణ స్వీకారం చేయిస్తారని చర్చ జరుగుతోంది. ఒవైసీ మాదిరిగానే 2024లో రాజ్యసభకు ఎన్నికైన ఎంపీ స్వాతి మలివాల్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రత్యేకంగా నినాదాలు చేశారు. అప్పుడు స్వాతి మలివాల్‌ మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని రాజ్యసభ ఛైర్మన్ చెప్పారు.

దేశ అత్యన్నత సభలో మరో దేశాన్ని కీర్తించటం ఇదే మొదటిసారని రాజ్యంగ నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఒరవడికి అడ్డుకట్టవేసే దిశగా రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్