లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర ఈ రోజు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యాడు. కట్టు దిట్టమైన భద్రత మధ్య లక్నోలోని పోలీసు కార్యాలయానికి ఆశిష్ మిశ్రా వచ్చాడు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆశిష్ మిశ్ర సహచరులు లవ్ కుష్, ఆశిష్ పాండే లను ఇప్పటికే అరెస్టు చేశారు.
సుప్రీమ్ కోర్టులో లఖింపూర్ ఖేరి దుర్ఘటన విచారణ, ధర్మాసనం యుపి ప్రభుత్వానికి అక్షింతలు వేయటం, విచారణకు హాజరయ్యేందుకు తన కొడుకు ఆరోగ్యం బాగాలేదని కేంద్రమంత్రి నిన్న ప్రకటించటం వరుసగా జరిగాయి. ఈ కేసులో చట్ట ప్రకారం నడుచుకుంటామని, ఎవరి ఒత్తిళ్లకు తలోగ్గమని సిఎం యోగి ఆదిత్యనాత్ ప్రకటన బిజెపికి మంచి కన్నా చెడు ఎక్కువ చేసింది. యోగి ప్రకటనపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఈ పరిణామాల మధ్య ఆశిష్ మిశ్ర పోలీసుల ముందుకు రాక తప్పలేదు.
ఆశిష్ మిశ్ర పోలీసులు ముందు హాజరు కావటంతో పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దు నిరాహార దీక్ష విరమించారు. రైతులతో పాటు చనిపోయిన జర్నలిస్టు రాం కశ్యప్ ఇంటి ముందు లఖింపూర్ ఖేరిలో నిన్నటి నుంచి సిద్దు నిరాహార దీక్ష చేపట్టారు.
మరోవైపు లఖింపూర్ ఖేరి ఘటన రైతుల్లో మరింత పట్టుదల పెంచిందని బిజెపి ఎంపి వరుణ్ గాంధి అన్నారు. న్యాయం జరిగే వరకు లఖింపూర్ ఖేరి తరహాలో రైతులు ప్రభుత్వంలో ఉన్నవారిని అడ్డుకుంటారని వరుణ్ ఓ వీడియో విడుదల చేశారు. అధికార పార్టీ ఎంపి ఈ తరహ ప్రకటన చేయటం సంచలనం అయింది.