Host-Taste: విజయవాడలో మాజీ మేయర్ జంధ్యాల శంకర్ ఆహ్వానిస్తే ముగ్గురు మిత్రులం రాత్రి భోజనానికి వెళ్లాము. దాదాపు తొంభై ఏళ్ల వయసున్న ఆయన్ను చూస్తే ఎవరికయినా ఉత్సాహం పొంగి పరవళ్లు తొక్కాల్సిందే. కొద్దిగా వినికిడి సమస్య ఉండి చెవిలో వినికిడి మిషన్ తప్ప…మాట్లాడేప్పుడు కళ్లల్లో కాంతి, అరవై, డెబ్బయ్ ఏళ్ల కిందటి విషయాలను పూసగుచ్చినట్లు చెప్పే జ్ఞాపకశక్తి, అతిథులకు టిష్యు పేపర్లు చేతికి అందించడం మొదలు రాచ మర్యాదలు చేయడం, ఉషశ్రీ, విశ్వనాథ, చిట్టిబాబు, జంధ్యాల సంగీత, సాహిత్య, సినిమా సంగతులను నెమరువేసుకోవడం...ఇలా ప్రతి క్షణమూ ఆయన మనకేదో పాఠం చెబుతున్నట్లు, నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది.
ఆయన అమెరికా పౌరుడు. ఆయన కుమారుడు జంధ్యాల రవి అమెరికాలో ప్రఖ్యాత వైద్యుడు. తొంభైల దగ్గరున్న ఆయన విజయవాడ కిక్కిరిసిన రోడ్ల మధ్య భార్య పక్కన కూర్చోగా కారు స్టీరింగ్ పట్టుకుని…నా వెనుక రండి మీరు అని నవ్వుతూ అంటే అలాగే వెళ్లాను ఒకసారి.
ఈసారి కలవగానే ఐ ఫోన్లో నా నంబర్ సేవ్ అయి ఉందో! లేదో! చెక్ చేసుకున్నారు. మా అబ్బాయి షష్టిపూర్తి ఫంక్షన్ చేస్తున్నాం విజయవాడలో. అమెరికా నుండి 25 కుటుంబాలు వస్తున్నాయి. మీ డేట్లు బ్లాక్ చేసుకోండి… అని కారప్పూస, వేయించిన పల్లీల ప్లేట్లు మా చేతికిచ్చారు.
ఓ గంట లోకాభిరామాయణం అయ్యాక డాబా పై నుండి కిందికి భోజనాలకు ఆయన వెంట నడిచాము. మరో పది నిముషాల్లో భోజనాలకు దిగుతున్నామని భార్యకు ఫోన్ చేసి…టేబుల్ మీద అన్నీ సిద్ధం అని సమాధానం వచ్చాకే మమ్మల్ను లేపారు. ఆయనకు తగిన భార్య ఆమె. చపాతీలు, కూర, పచ్చళ్లు, సాంబార్, ఉప్మా, పెరుగు…ఏదీ వదలడానికి వీల్లేకుండా దంపతులిద్దరూ కొసరి కొసరి వడ్డించారు.
మీరు విజయవాడ మేయర్ అయినప్పుడు ఆంధ్రభూమి దినపత్రిక పెట్టిన
“ఆయన మేయరు- మరొకరిని మేయనివ్వరు”
శీర్షిక మాకు జర్నలిజంలో గొప్ప పాఠం సార్ అంటే…
సరిగ్గా డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబోతూ ‘మేయరు’ అంటే ఎలా? మనమిప్పుడు బాగా ‘మేయాలి’ కదా?
“నేను మేశాను…మిమ్మల్ని మేయనిచ్చాను”
అని హెడ్డింగ్ మార్చుకోండి అని నా మీద రివర్స్ పంచ్ వేసి ముసి ముసి నవ్వులు నవ్వారు.
మీరు పెద్దవారు…కూర్చోండి…మేము వడ్డిస్తామని ఇదివరకు ఒకసారి అంటే ఆయన అభ్యంతరం చెప్పారు. ఐ యామ్ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ యూ ఆర్ మై గెస్ట్స్. ఇట్స్ మై డ్యూటీ టు సర్వ్ యు. ఐ ఎంజాయ్ ఇట్…అని క్లాసు తీసుకున్నారు. పెరుగు చాలా బాగుంది గిన్నె మొత్తం తినాలి అని చివర షరతు పెట్టారు. ఏదో మరచిపోయినట్లు గదిలోకి వెళ్లి శక్తి వక్కపొడి ప్యాకెట్లు కత్తెర తెచ్చి కట్ చేసి మా చేతిలో పోశారు భోజనం సంపూర్ణం అన్నట్లు.
వయసులో మేము ముగ్గురం ఆయనకంటే చాలా చిన్నవాళ్లం. మాకు వీడ్కోలు చెప్పడానికి కాలికి చెప్పుల్లేకుండా గేటు దాటి రోడ్డుమీదికి వచ్చారు. మీ కార్లు లోపల పార్క్ చేసుకోవాల్సింది…బయట పెట్టుకున్నారే…ఇంకాసేపు ఉండాల్సింది అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పంపారు. అదే తొంభై ఏళ్ల వయసులో మేమెలా ఉంటామో…ఊహించుకుని…గగుర్పాటుతో కారెక్కాము.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]