ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఆమె పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఐదున్నర నెలలపాటు జైలు జీవితం గడిపి ఇటీవలే బెయిల్ పై విడుదలైన కేజ్రీవాల్… ఎన్నికలు జరిగి ప్రజల విశ్వాసం తిరిగి పొందేవరకూ తాను ఆ కుర్చీలో కూర్చోబోనని ప్రకటించిన సంగతి తెలిసిందే. నూతన సభాపక్షనేతను ఎన్నుకోవడంపై రెండ్రోజులుగా పార్టీ నేతలతో కేజ్రీవాల్ ఎడతెగని మంతనాలు సాగిస్తూ వచ్చారు. సీఎం రేసులో మంత్రులు అతిశి, భరద్వాజ్ , గోపాల్ రాయ్, గెహలోత్ లు ఉన్నా… చివరకు అతిషి పేరును ఖరారు చేస్తూ నేడు జరిగిన శాసన సభాపక్ష సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆమె పేరును స్వయంగా కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు బలపరిచారు.
ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న అతిషి ప్రస్తుతం కేజ్రీవాల్ ప్రభుత్వంలో కీలకమైన విద్య, పి డబ్ల్యూ డి, టూరిజం, కల్చర్, శాఖలు నిర్వహిస్తున్నారు. కేజ్రీ అరెస్టు నేపథ్యంలో ప్రభుత్వ నిర్వహణలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీలో అనేక సంక్షోభాలు తలెత్తిన సమయంలో తమ అధినేతకు అండగా ఉంటూ… రాజకీయ వివాదాలు తలెత్తినప్పుడు పార్టీ తరపున బలమైన గొంతుక వినిపిస్తూ వచ్చారు. ఢిల్లీ సిఎంగా ఎన్నికైన మూడో మహిళా నేత అతిశీ, గతంలో సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఈ పదవి చేపట్టారు.
ఈ సాయంత్రం 4.30 గంటలకు లెఫ్ట్నెంట్ గవర్నర్ ను కలిసి తన పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తో పాటే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు.