Tuesday, July 9, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇంకానా! ఇకపై చెల్లదు

ఇంకానా! ఇకపై చెల్లదు

Right Perception: సుధామూర్తి… ఈ పేరు అందరికీ పరిచితమే. ఇన్ఫోసిస్ సారధి నారాయణమూర్తి భార్యగా కన్నా ఒక వ్యక్తిత్వం కలిగిన స్త్రీమూర్తిగా ఎందరో ఆవిడని అభిమానిస్తారు. మహిళలు అరుదుగా చదువుకునే రోజుల్లోనే ఇంజనీరింగ్ చెయ్యడమే కాకుండా ‘ పురుషులకు మాత్రమే’ అని ఉద్యోగాలు ప్రకటించిన టాటా సంస్థతో పోరాడి జెఆర్ డి టాటా అభిమానపుత్రికగా ఆ సంస్థలో పనిచేశారు. ఈ రోజు మనం చెప్పుకొనే లింగ సమానత్వం కోసం ఆ రోజుల్లోనే పోరాడిన సుధామూర్తి మహిళాలోకానికి మార్గదర్శి.

అయితే ఇలా ఒక్కొక్కరుగా పోరాడటమే తప్ప ఉద్యోగాల్లో మహిళల పట్ల వివక్ష ముఖ్యంగా కొన్ని పడికట్టు పదాల వ్యవహారం కొనసాగుతోంది. అన్నిరంగాల్లో దూసుకుపోతున్నా వారి గురించి మాట్లాడేటప్పుడు పదాలు తేడాగానే ఉంటాయి. ఆడవాళ్లు లీవ్ అడిగినా, పనిలో పొరపాటు దొర్లినా అదోరకంగా చూడటం, ఎకసెక్కెంగా మాట్లాడటం చాలామందికి అనుభవమే. వీటి గురించి పై వారికి ఫిర్యాదు చేయలేని, చేసినా అక్కడా అదే ప్రవర్తన.

మహిళాసంఘాలు, కోర్టుల చొరవతో పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతోంది. పెద్ద, మధ్యతరహా కంపెనీల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ,2013 ప్రకారం అంతర్గత కమిటీల ఏర్పాటు తప్పనిసరి. అంతే కాదు, పనిలో ఇతరత్రా మహిళల సంబోధన, వ్యవహారాలపై కేంద్రం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అనేక కంపెనీలలో ఉన్న కమిటీలు వాటిలో పనిచేసేవారు కంపెనీ పాలసీ, ఇతర వ్యవహారాల్లో మహిళల పట్ల లింగ వివక్ష చూపే పదాలు మార్చడానికి కృషి చేస్తున్నారు.

సుప్రీం మార్గం
సుప్రీం కోర్టు సైతం మహిళలకు సంబంధించిన కేసుల్లో వివక్షా పూరిత పదాలు వాడకుండా 30 పేజీల హ్యాండ్ బుక్ రూపొందించింది. ప్రస్తుతం ఈ బుక్ ఎందరికో కంపెనీల్లో మార్గదర్శకాలు రూపొందించడానికి ఉపయోగపడుతోంది. చాలా చోట్ల పడికట్టు పదాలు వాడటానికి అలవాటుపడతారు. అందుకే చాలామంది మహిళలు న్యాయం కోసం కోర్టుకి వెళ్ళడానికి సంకోచిస్తారు. అయితే 30 పేజీల సుప్రీం హ్యాండ్ బుక్ ఏ సందర్భంలో ఎటువంటి సంబోధన, పదాలు వాడితే బాగుంటుందో సూచించడంతో లాయర్లకు, పోష్ ( ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్ మెంట్ ) యాక్ట్ పైన పనిచేసే వారికి సులభం అయింది. ప్రస్తుతం పలు కంపెనీలు తమ అంతర్గత విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. మహిళల వస్త్రధారణ, ప్రవర్తనకు సంబంధించి పదాలు వాడేటప్పుడు సైతం అవమానకరంగా కాకుండా వేరే పదాలు సూచించడంతో మహిళలనుంచి హర్షం వ్యక్తమవుతోంది. 2021 లో సుప్రీం కోర్టు ఒక తీర్పులో ‘ హౌస్ వైఫ్’ అనే పదానికి ‘హోమ్ మేకర్’ అని పేర్కొనడమే కాకుండా మహిళల శ్రమ జాతీయాదాయానికి ఎలా ఉపయోగపడుతుందో వివరించడంతో ఇప్పుడందరూ అదే మాట వాడుతున్నారు.

ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ పాలసీలు , విధి విధానాల్లో మహిళలకు సంబంధించి మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగ నియామక ప్రకటనలు, తదితరాల్లో వాడే పదాల్లో మార్పులు చేస్తున్నారు. ఈ అంశంపై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మహిళలతో మాట్లాడేటపుడు వాడాల్సిన భాష, టోన్, బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై నిపుణుల చేత చెప్పిస్తున్నారు. పాత పడికట్టు పదాలు తొలగిస్తున్నారు. ఫలితంగా మహిళల్లో కంపెనీ పట్ల నమ్మకం పెరుగుతోందని జ్యోతి దద్లాని అనే సైకాలజిస్ట్ అభిప్రాయం. ఈమె కంపెనీల అంతర్గత కమిటీలకు ట్రయినింగ్ ఇస్తారు.

ఎన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినా, పాలసీలు మార్చినా మగవారి ఆలోచనల్లో మార్పు రానంతవరకు ఫలితం ఉండదు. కానీ మార్పు ఎక్కడో ఒకచోట మొదలవ్వాలి. సుప్రీం ముందడుగుతో ఆ మార్పు సుసాధ్యం అవుతుందని ఆశిద్దాం.
-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్