ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన క్వీన్‌ ఎలిజబెత్‌ II ఫొటోని తమ కరెన్సీ నోటు నుంచి తొలగించనుంది. ఆ దేశ 5 డాలర్ల కరెన్సీ నోటు నుంచి క్వీన్ ఎలిజబెత్ ఫోటోను తొలగించి స్వదేశీ సంస్కృతి, చరిత్రలను ప్రతిబింబించేలా, గౌరవించేలా కొత్త డిజైన్‌ను రూపొందించనున్నట్టు ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించింది.

ప్రస్తుత 5 డాలర్ల నోటుకు ఒకవైపు క్వీన్ ఎలిజబెత్ 2 ఫోటో, మరోవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనం ఉంటుంది. కేవలం ఎలిజబెత్ ఫోటోను మాత్రమే తొలగించి, పార్లమెంట్ భవనాన్ని కొనసాగిస్తామని ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత తమ కరెన్సీ నోట్లపై కింగ్ ఛార్లెస్ ఫోటోను ఉంచబోమని, తమ దేశానికి చెందిన నేతల ఫోటోలను ఉపయోగిస్తామని గతేడాది ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే కొత్త కరెన్సీ నోటు రూపకల్పనలో స్వదేశీ సమూహాలతో సంప్రదింపులు జరుపుతామని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కొత్త నోటు రూపకల్పన, ముద్రణకు కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని.. అప్పటి వరకు ప్రస్తుత నోటు చలామణిలో ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

గతేడాది సెప్టెంబరులో క్వీన్ ఎలిజబెత్ మరణం ఆస్ట్రేలియాలో రాజ్యాధినేత భవిష్యత్తు గురించి చర్చకు దారితీసింది. 1999 నాటి ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటీష్ చక్రవర్తిని దేశాధినేతగా కొనసాగించాలని తీర్పు వచ్చింది. రాణి మరణం తర్వాత బ్రిటిష్ చక్రవర్తి అయిన ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ III.. బ్రిటన్ వెలుపల ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఇతర 12 కామన్వెల్త్ రాజ్యాలకు అధిపతిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *