Aussies in Finals: ఆస్ట్రేలియా ఐసిసి మహిళా వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకుంది. లీగ్ మ్యాచ్ ల్లో పరాజయం అనేది లేకుండా సెమీస్ కు చేరిన ఆసీస్ మహిళా జట్టు సెమీస్ లో కూడా అదే జోరు కొనసాగించి వెస్టిండీస్ పై 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధమైంది.
వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ మైదానం వేదికగా జరిగిన నేటి మ్యాచ్ ను వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా తొలి వికెట్ కు 216 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. ఓపెనర్లు అలీస్సా హేలీ 107బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్సర్ తో 129, రేచల్ హేన్స్ కూడా 85 పరుగులు చేసి ఔటయ్యారు. గార్డెనర్ 12 పరుగులు చేయగా, బెత్ మూనీ-43; కెప్టెన్ లన్నింగ్- 26 పరుగులతో అజేయంగా నిలిచారు. కేటాయించిన 45 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 305 పరుగులు రాబట్టింది. విండీస్ బౌలర్లలో హెన్రీ రెండు; శామీలియా కన్నెల్ ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ విలియమ్స్ డకౌట్ గా వెనుదిరిగింది. జట్టులో కెప్టెన్ స్టెఫానీ టేలర్-48; హెలీ మాథ్యూస్-34; డీంద్ర దొట్టిన్-34 మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జట్టులో ఇద్దరు డకౌట్ కాగా మరో ఇద్దరు బ్యాటింగ్ కు దిగలేదు. దీనితో 37 ఓవర్లలో 148 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బౌలర్లలో జెస్ జోనేస్సేన్ రెండు వికెట్లు తీయగా, మిగిలిన బౌలర్లు తలా ఒక వికెట్ పడగొట్టారు. సెంచరీ సాధించిన అలెస్సా హేలీ కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : మహిళల వరల్డ్ కప్: ఇండియా ఓటమి- నిష్క్రమణ