Saturday, January 18, 2025
HomeTrending Newsనిధుల సమీకరణ లక్ష్యంగా బాబు ఢిల్లీ టూర్

నిధుల సమీకరణ లక్ష్యంగా బాబు ఢిల్లీ టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన నేడు మూడోరోజు కూడా బిజీగా సాగింది. మొన్న జూలై ౩న రాత్రి దేశ రాజధాని చేరుకున్న బాబు.. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షా, కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కలుసుకున్నారు.  నేడు కూడా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకొని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వివిధ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై ఆయా కేంద్రమంత్రులతో చర్చించి వాటిని సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ ఉదయం మొదటగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియాతో కలుసుకున్నారు, ఆ తర్వాత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాలతో ఆయన భేటీ అయ్యారు.

గత ప్రభుత్వ నిర్ణయాలు, పనుల కారణంగా రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులలో ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు వివరించారు. ఆర్థికంగా ఆదుకోవాలని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి తగినంత సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ నెల నాలుగో వారంలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. దానిలో  ఏపీకి ఇచ్చే ప్రాధాన్యతపై చర్చించారు.

బాబు వెంట పర్యటనలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, భరత్, పుట్టా మహేష్ యాదవ్, దుర్గా ప్రసాద్ ఇతరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్