Wednesday, January 22, 2025
HomeTrending NewsChandrababu: బిల్లులు లేకుండా శ్రీవాణి టిక్కెట్లు: బాబు

Chandrababu: బిల్లులు లేకుండా శ్రీవాణి టిక్కెట్లు: బాబు

అధికారంలోకి  రాగానే సరికొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చి  ఛార్జీలు తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. గత పాలనలో తాము మిగులు విద్యుత్ తీసుకొస్తే ఈ ప్రభుత్వం నాటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేసి విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారని, ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు.  డిబిటి అని చెప్పుకుంటున్న సిఎం జగన్ మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అంగీకరించడంలేదని ప్రశ్నించారు. టిటిడి శ్రీవాణి టిక్కెట్లకు కూడా  బిల్లు ఇవ్వడం లేదని, ఆ డబ్బులు ఎవరి అకౌంట్లలో వెళుతున్నాయని నిలదీశారు. వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెట్టినవాడు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ఎవరు రన్ చేస్తున్నారో చెప్పాలని, దేవుడి డబ్బులు లెక్కలు లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో టిడిపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ మినీ మేనిఫెస్టో  భవిష్యత్తుకు గ్యారెంటీ, బస్సుయాత్ర, ప్రచార కార్యక్రమాలపై పార్టీ నేతలకు బాబు దిశా నిర్దేశం చేశారు.

గుడివాడలో టిడ్కో ఇళ్ళు మొన్న పంపిణీ చేశారని, ఆరునెలల్లో పూర్తి కావాల్సిన టిడ్కో ఇళ్ళు నాలుగేళ్ల తరువాత పూర్తి చేశారని, గతంలో తాను మొదలు పెట్టిన ఇళ్ళను లబ్ధిదారులకు ఇస్తూ వారి  గొప్పదనంగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎవడికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకొనే దరిద్రమైన బతుకులు అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

గతంలో తాము పోరాడినప్పుడే గంజాయిని అరికట్టి ఉంటే ఇప్పుడు రాష్రంలో ఇన్ని ఘోరాలు జరిగి ఉండేవి కావని అన్నారు.  ఇటీవలి కాలంలో నాలుగు రోజుల్లో నాలుగు సంఘటనలు జరిగాయని, ఇవన్నీ గంజాయి, డ్రగ్స్ వల్లే సంభవించాయని పేర్కొన్నారు. రేపల్లెలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని దారుణంగా కాల్చి చంపడం తన మనసును కలచి వేసిందన్నారు.  విశాఖ పట్నంలో అధికార పార్టీ ఎంపి కుటుంబ సభ్యులను, సిఎంకు సన్నిహితుడైన ఆడిటర్ ను కిడ్నాప్ చేశారంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాలన్నారు. ఆ ఎంపి విశాఖ వదిలి హైదరాబాద్ కు ఆఫీసు మకాం మార్చాలని నిర్ణయించడం ఈ ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్ మీద కౌన్సిలర్ దాడి చేస్తే దానికి సాక్షాత్తూ ఓ మంత్రి సాక్షిగా ఉన్నారని మండిపడ్డారు. సత్యసాయి జిల్లాలో 12 కోట్ల రూపాయల ఆస్తిని బలవంతంగా రాయించుకుంటే నిస్సహాయుడై ఓ వ్యక్తి ఆత్మహత్య సుకొని చనిపోయారన్నారు. ఈ నాలుగు సంఘటనలూ రాష్ట్రంలో పరిస్థితిని తెలియజేస్తున్నాయని వాపోయారు.

పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు మేరకు దసరా నాటికి సంపూర్ణమైన మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్