అనపర్తి బహిరంగ సభలో చంద్రబాబు తీరు ఆక్షేపణీయమని, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఏం చెబుతుందని ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో, ప్రజలు తనను ఏ మాత్రం ఆదరించడం లేదన్న దుగ్ధతో చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. సీఎం జగన్ ను నిందించడం, చివరకు తనకు భద్రత కల్పిస్తున్న పోలీసులపైనా పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ కనీస మర్యాద అనేది లేకుండా బాబు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో కలిసి పిల్లి మీడియాతో మాట్లాడారు.
రోడ్‌షోకు అనుమతి తీసుకుని, బహిరంగసభకు సిద్ధమైన చంద్రబాబుకు రెండింటి మధ్య తేడా తెలియదా?అని నిలదీశారు. సభ వేదిక మార్చుకోవాలని పోలీసులు చంద్రబాబుకు పలు విధాలుగా విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిన చంద్రబాబు, వారిని ఇష్టానుసారం తిట్టడం ఎంత వరకు సబబని పిల్లి నిలదీశారు.
“బాబూ నువ్వేమైనా జాతీయ ఉద్యమాల్లో పాల్గొన్నావా? మహాత్మాగాంధీతో పోల్చుకుంటున్నావు! జాతీయ నాయకులతో నిన్ను నువ్వు పోల్చుకోవడాన్ని నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ పోరాట ఉద్యమకారుడైతే.. నీవు కేవలం జాతి ఉద్యమకారుడివే’.. ఇది వాస్తవం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో” అంటూ పిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించి అనపర్తిలో బహిరంగ సభ నిర్వహించారని, రోడ్‌షోకు అనుమతి తీసుకుని బహిరంగ సభ పెట్టారని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అన్నారు. దీనిపై ప్రశ్నించిన పోలీసులపై బాబు దౌర్జన్యం, గుండాయిజం చేశారని, ఓపెన్ గ్రౌండ్‌లో సభ ఏర్పాటు చేసుకుంటే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పినా వినకుండా.. నడిరోడ్డుపై ఏకంగా రెండు వేల మందితో సభ పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని, ఆయన చేష్టలన్నీ ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
అవినీతి తిమింగలమైన మాజీ ఎమ్మెల్యేను పక్కన పెట్టుకుని చంద్రబాబు నోటికొచ్చినట్లు తనమీద ఆరోపణలు చేశారని, అనపర్తిలో తన ఆస్తుల మీద.. చంద్రబాబు మొత్తం ఆస్తులపై సీబీఐతో ఏకకాలంలో విచారణ చేయిద్దామని సూర్య నారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అభివృద్ధిలో అనపర్తి ముమ్మాటికీ మరో పులివెందుల అని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడ పోటీ చేసి గెలవగలరా అని ఛాలెంజ్ చేశారు.