Friday, March 29, 2024
HomeTrending Newsఎన్నికలకు సిద్ధంగా ఉండండి: బాబు పిలుపు

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: బాబు పిలుపు

Be Ready: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని తెలుగుదేశం కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. మహానాడు ముగింపు సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బాబు ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభమైనదని, క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర ప్రదేశ్  నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచారని, ఇవి ఎవరు కడతారని బాబు ప్రశ్నించారు. అక్రమ మద్యంతో ఏటా ఐదు వేల కోట్ల రూపాయల సంపాదన లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ మూడేళ్ళలో జగన్ లక్షా 75 వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీతో పాటు ప్రజలపై కూడా ఉందని, లేకపోతే ఏపీ మరో శ్రీలంకగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత అవినీతి సోమ్మునంతా కక్కిస్తానని హెచ్చరించారు.

మహానాడుతో జగన్ కు పిచ్చెక్కి పోతోందని, వైసీపీ నేతల గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయని,  అందుకే ఎన్నో అడ్డంకులు సృష్టించారని, వారి సభలు వేలవేలబోతుంటే మన మీగింగులు కళకళ లడుతున్నాయని బాబు అన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని, జగన్ ను త్వరగా ఇంటికి  పంపించాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇదే స్పూర్తితో పోరాటం కొనసాగించి వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని చాలెంజ్ చేశారు.

తప్పుడు కేసులతో భయపెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని. ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదని, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని సవాల్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై పోరాడాలని, కేసులు పెడితే వారి తరఫున పోరాడేందుకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి ప్రజలు తిరగబడుతుంటే అది మానేసి బస్సుయాత్ర చేపట్టారని, వారివైపు బస్సులు ఉంటే మనవైపు కార్యకర్తలు ఉన్నారని స్పష్టం చేశారు. విభజన, కరోనా కంటే ఎక్కువగా జగన్ వాళ్ళ రాష్ట్రానికి ప్రమాదం వాటిల్లిందన్నారు.

కోనసీమలో సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ హస్తం ఉంటే  ఆ కేసు నుంచి దృష్టి మరల్చడానికే అమలాపురం అల్లర్ల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అమరావతిని నాశనం చేయడం ద్వారా 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయామన్నారు. ఈ ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరాటానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్