Saturday, July 27, 2024
HomeTrending Newsకీర్తి జల్లి ఐఏఎస్... సోషల్ మీడియాలో వైరల్

కీర్తి జల్లి ఐఏఎస్… సోషల్ మీడియాలో వైరల్

Keerthi Jalli :ఈశాన్య రాష్ట్రం అసోంలో భారీ ఎత్తున సంభవించిన వరదలు 30 మందిని బలిగొన్నాయి. 5.61 లక్షల మంది ప్రజలు వరద ముంపు ప్రభావానికి గురయ్యారు. వరద బాధితుల కోసం అసోం సర్కారు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఓ మహిళా ఐఏఎస్ అధికారి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ఆమె పేరు కీర్తి జల్లి. కీర్తి తెలంగాణ తేజం. అసోంలో  కచార్ (cachar) జిల్లాకు కలెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వరదల సందర్భంగా కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలిస్తూ, సమీక్షలు జరిపితే సరిపోతుంది. కానీ కీర్తి జల్లి తానే స్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవడమే కాకుండా, వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ఎంతో శ్రమిస్తున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణ చీరకట్టులో, మోకాళ్ల లోతు బురద నీటిలో ఆమె ఇంటింటికి తిరుగుతూ వరద బాధితులను పరామర్శిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అంతేకాదు, నిరాశ్రయులను స్వయంగా పడవపై పునరావాస కేంద్రానికి తరలించారు. ఓ గ్రామంలో ప్రజలు ఆమె కలెక్టర్ అని తెలిసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వరదలు రావడం తమకు కొత్తేమీ కాదని, వరదలు వచ్చినప్పుడు కలెక్టర్ రావడమే తమకు కొత్తగా ఉందని వారు వ్యాఖ్యానించారు.
కాగా, 2016లో అసోం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడి ప్రజలను ఓటు హక్కు వినియోగించుకునే దిశగా కొత్త రీతిలో ప్రోత్సహించారు. ‘భోని’ అనే బొమ్మలను తయారుచేయించి పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉంచారు. అసోంలో చిన్న చెల్లెలిని ‘భోని’ అంటారు. అసోం సంస్కృతిలో చిన్న చెల్లెలికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వారి సెంటిమెంట్ ను పసిగట్టిన కీర్తి జల్లి ‘భోని’ బొమ్మల సాయంతో సత్ఫలితాలు రాబట్టింది. ఆమె ప్రయత్నం ఫలించి, మహిళా ఓటర్లు గణనీయ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కీర్తి జల్లి ప్రయత్నం ఎన్నికల సంఘాన్ని కూడా ఆకట్టుకుంది. అప్పటి దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆమెకు ‘బెస్ట్ ఎలొక్టరల్ ప్రాక్టీసెస్’ అవార్డు అందించారు.
అంతేకాదు, హైలాకండి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మహిళలు, చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉసిరి, బెల్లం కలిపిన ఉసిరి మురబ్బా తయారు చేయించి మహిళలకు పంపిణీ చేశారు. కీర్తి జల్లి ప్రయత్నం ఫలించి, వారి ఆరోగ్యం మెరుగుపడింది. ఇవే కాదు, కీర్తి జల్లి ఉద్యోగ ప్రస్థానంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.
Keerthi Jalli Ias
కుటుంబ నేపథ్యం :
కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్‌. తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె, ఢిల్లీలో కోచింగ్ తీసుకుని సివిల్స్ రాశారు. 2013లో నేషనల్ లెవెల్లో 89వ ర్యాంకు సాధించిన కీర్తి… శిక్షణ అనంతరం అసోంలో విధుల్లో చేరారు.
మచ్చుకు ఒక సందర్భం:
గత సంవత్సరం సెప్టెంబర్ 10. అసోం లోని కచార్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన సిల్చార్ లో కొంతమంది ఉన్నతాధికారులకు మేసెజ్ పంపించింది కలెక్టర్ కీర్తి. మా ఇంట్లో వినాయక పూజ ఉంది రమ్మని. అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ మరో పాతిక మంది కనిపించారు. వారికి అప్పుదు తెలిసింది తాము వచ్చింది కేవలం వినాయక పూజకే కాదు. కలెక్టర్ గారి పెళ్ళికి అని. అంత నిరాడంబరంగా ఆమె పెళ్ళి జరిగిపోయింది.
అది కరోనా సమయం కావడంతో పెళ్ళైన మరుసటిరోజు నుండే మళ్ళీ డ్యూటీలో నిమగ్నం అయిపోయింది.
హైదరాబాద్ లో ఉన్న తల్లిదడ్రులు కోవిడ్ తో బాధ పడుతున్నా తాను మాత్రం అసోం లోనే కోవిడ్ సేవల్లో నిమగ్నమైపోయింది.
అంతేకాదు గతంలో మరెన్నో విషయాల్లో తన ప్రతిభను కనబరిచి ఎన్నెన్నో ప్రశంసలు అందుకుంది. అవన్నీ చెబితే నిడివి ఎక్కువ అవుతుంది.
కీర్తి జెల్లి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటారు. “తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని” ఆమె విశ్వాసం.
Also Read :
RELATED ARTICLES

Most Popular

న్యూస్