పేదవారిని సంపన్నులుగా, కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీనికోసమే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు నిరుపేద కుటుంబాలను ఆర్ధికంగా పైకి తీసుకు వచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళా సంఘాలతో బాబు ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తెలుగు మహిళా నేతలు ఆయనతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బాబు మాట్లాడుతూ… ఆర్ధికంగా పటిష్టంగా ఉన్నవారు కొన్ని నిరుపేద కుటుంబాలకు చేయూత ఇచ్చేలా ఓ పథకం రూపొందిస్తున్నామని, దీనికోసం ఓ ప్రత్యేక యాప్ ను కూడా తీసుకు వస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి పెదవారికీ ఈ విషయంలో అవగాహన తీసుకు వస్తామని, తెలుగు జాతి మొత్తం ఆనందంగా ఉండాలన్నదే తన వ్యసనం, అదే నా కిక్ అంటూ అభివర్ణించారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 65వ స్థానంలో ఉండడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు.
ఏపీకి, తెలంగాణకు నక్కకు-నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలంగాణ మంత్రి హరీష్ రావు చెప్పిన విషయాన్ని బాబు గుర్తు చేస్తూ, హైదరాబాద్ లో తాను చేపట్టిన కార్యక్రమాలను మిగిలిన ముఖ్యమంత్రులు కొనసాగించారని, వైఎస్ కూడా హైటెక్ సిటీ, ఎయిర్ పోర్ట్ లాంటి వాటిని పూర్తి చేశారని, అందుకే ఆయనకు కూడా తాను థ్యాంక్స్ చెప్పానన్నారు. కానీ జగన్ అమరావతిని నాశనం చేసి ఐదు లక్షల కోట్ల రూపాయల సంపద బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు.
తన పుట్టిన రోజున రెండు అంశాలపై సంకల్పం తీసుకుంటున్నానని… తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని, ప్రతి తెలుగువాడు కోటీశ్వరుడు కావాలన్నదే తన ఆశయమని చెప్పారు.