Monday, January 20, 2025
HomeTrending Newsపోలవరంపై బాబుది దుష్ప్రచారం: అంబటి ఆరోపణ

పోలవరంపై బాబుది దుష్ప్రచారం: అంబటి ఆరోపణ

చంద్రబాబు పాలనలో పోలవరం విషయంలో ప్రచార యావే తప్ప ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం చూపలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బాబు తెలివితక్కువతనం, ఆత్రుత, తొందరగా పూర్తి చేయాలనే అతి తెలివితేటల వల్ల ప్రాజక్టు నిర్మాణం జాప్యం అవుతోందన్నారు. టిడిపి హయంలో హెడ్ వర్క్స్ అంచనాలు 5,943.91 కోట్ల రూపాయలుగా ఉండేదని దీనిలో 3,591కోట్లు వారు ఖర్చు పెట్టారని దీన్ని లెక్కవేసి ప్రాజెక్టు తాము 72 శాతం పూర్తి చేశామని చెప్పుకోవడం శోచనీయమన్నారు. అసలు ఈ లెక్క కూడా తప్పేనని వారు చేసింది 60 శాతమేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈ అంచనాలు 7,422 కోట్ల రూపాయలుగా పెరిగాయని,   దీనితో పోలిస్తే అసలు పూర్తి చేసింది 48 శాతం మాత్రమేనన్నారు.  ప్రాజెక్టు లోయర్ కాఫర్ డ్యాం పూర్తయిన సందర్భంగా మంత్రి అంబటి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సైటు వద్ద మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు.

పోలవరం అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, స్పిల్ వే తామే పూర్తి చేశామని, అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, పైలట్ చానల్ కూడా తాము పూర్తి చేస్తున్నామని అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రాజెక్టు కూడా తామే పూర్తి చేసి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. బాబు హయంలో పోలవరం ప్రాజెక్టులు సర్వనాశనం చేశారని, కాఫర్ డ్యామ్ ల నిర్మాణం చేయకుండా డయా ఫ్రమ్ వాల్ పూర్తి చేశారని పునరుద్ఘాటించారు. పోలవరం విషయంలో బాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.  సహాయ పునరావాస కార్యక్రమాల విషయంలో కూడా తామే అధిక నిధులు ఖర్చు చేశామని, బాబు హయంలో 193 కోట్ల రూపాయలు మాత్రమే దీనిపై ఖర్చు చేస్తే తమ మూడున్నరేళ్ళ కాలంలో 1,724 కోట్లు ఖర్చు చేశామన్నారు.

బాబు పోలవరం చూస్తానంటూ షో చేస్తున్నారని, ఆయన సిఎంగా ఉన్నప్పుడు సోమవారం పోలవరం అంటూ షో చేశారని, భజనలు చేశారని, పేపర్లో రాయించుకోవడం తప్ప, బిల్లులు కాజేయడం తప్ప చేసింది శూన్యమని అంబటి మండిపడ్డారు. అందుకే ఈ ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగిందని, ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై త్వరలో ఓ అంచనాకు వస్తామని, దీనిపై తమ వద్ద ఓ ప్రణాళిక ఉందని రాంబాబు చెప్పారు.

Also Read : విజయవంతంగా పోలవరం గేట్ల ఆపరేటింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్