రాష్టాన్ని 14 సంవత్సరాలపాటు పరిపాలించిన చంద్రబాబు సర్వనాశనం చేశారని, ఆయన ఇప్పుడు ఏం పునర్నిర్మాణం చేస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకొని వైఎస్సార్ కడప జిల్లా వొంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి అంబటి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…. చంద్రబాబు పునర్నిర్మాణం చేసుకునేది కుమారుడు లోకేష్ ను, ఆయన ఆస్తులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియా సహకారంతో చేయనివి చేసినట్లు చెప్పుకునే అసమర్ధుడు చంద్రబాబు అంటూ విమర్శించారు.

పోలవరంపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని, కేవలం తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు, చంద్రబాబుకు మేలు చేసేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ఎత్తు 45.72 నుంచి 41.5 అడుగులకు తగ్గిస్తున్నట్లు రాస్తున్నారని, ఈ విషయమై నిన్న కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలను సైతం పక్కన పెట్టు  ఈ ఎత్తును ఖరారు చేశారన్నారు. ఇలాంటి మీడియా వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ సమర్ధమైన పాలన తాము అందిస్తున్నామని వెల్లడించారు.

బాబు ఓ ప్రజానాయకుడు కాదని కేవలం ఓ మ్యానిపులేటర్ మాత్రమేనని, మరోసారి మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నాడని అంబటి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేనని సిఎం జగన్ స్పష్టంగా చెప్పినందునే నలుగురు ఎమ్మెల్యేలు మొన్నటి ఎన్నికల్లో టిడిపికి అమ్ముడు పోయారని రాంబాబు చెప్పారు. ఇంత ఫ్రాంక్ గా చెప్పే నాయకుడు జగన్ మాత్రమేనన్నారు.  ప్రజల వద్దకు వెళ్లి అన్ని వాస్తవాలు వివరిస్తామని, వారు మరోసారి తమనే ఆదరిస్తారని, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *