Friday, March 29, 2024
HomeTrending Newsఇవి మీకు ఉరితాళ్ళు : బాబు హెచ్చరిక

ఇవి మీకు ఉరితాళ్ళు : బాబు హెచ్చరిక

OTS row in AP:
ఓటిఎస్ పేరుతో జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఆరోపించారు. పేదల ఇళ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ ఇప్పుడు మాట తప్పారని, మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఓటిఎస్ పథకంలో టార్గెట్లు ఫిక్స్ చేసి వాటిని పూర్తి చేయాలని కింది స్థాయి అధికారులను ఒతిడికి గురిచేస్తున్నారని, ఈ అధికారులు పేదలను దౌర్జన్యం చేస్తున్నారని బాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని, కొన్ని చోట్ల పెదాలపై కేసులు కూడా పెడుతున్నారని, ఇలా చేస్తున్న అధికారులు ఖబడ్దార్ జాగ్రత్త అంటూ బాబు హెచ్చరించారు. ఈ పథకం ద్వారా పేదల మెదలకు ఉరితాళ్ళు వేయాలని చూస్తున్నారని, కానీ ఈ ఉరితాళ్ళు మీ మెడకే పడే పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. కొన్ని ప్రాంతాల్లో గతంలో కట్టినా మళ్ళీ ఇప్పుడు కట్టాలంటూ ఇప్పుడు బెదిరిస్తున్నారని కొన్ని సంఘటనలను ప్రస్తావించారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో డా. బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు, అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

గృహ నిర్మాణానికి ఎన్టీఆర్ హయంలోనే శ్రీకారం చుట్టారని, తాను సిఎం గా ఉండగా ఈ పథకానికి మరింత మెరుగులు దిద్దానని చంద్రబాబు వెల్లడించారు. ఎప్పుడో 1983లో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, తాము అధికారంలో ఉండగా ఇలాంటి ఇళ్ళ మరమ్మతుల కోసం పదివేల రూపాయలు ఆర్ధిక సాయం చేశామని, ఈ ప్రభుత్వం శక్తి ఉంటే 25 వేల రూపాయలు ఇవ్వొచ్చని కానీ వారి దగ్గరి నుంచే డబ్బులు దండుకోవడం దారుణమని బాబు అన్నారు. పేదల పట్ల ఇంత వివక్ష తగదని హితవు పలికారు.  గత ప్రభుత్వంలో తాము టిడ్కో ఇళ్ళకు శ్రీకారం చుట్టమని, అత్యుత్తమ పద్ధతులతో పేదలకు కూడా గేటెడ్ కమ్యూనిటీ లు నిర్మించామన్నారు.

ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలని, పేదలందరికీ ఉచితంగా ఇళ్ళ పట్టాలు,  రిజిస్ట్రేషన్లు చేయించాలని బాబు డిమాండ్ చేశారు. లేకపోతే తాము అధికారంలోకి రాగానే ఈ పని చేస్తామని భరోసా ఇచ్చారు.

Also Read : బాబుకు ప్రతిరోజూ విషాద దినమే: రాంబాబు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్