వివేకానంద హత్య కేసులో సీబీఐ ఛార్జిషీటు మాత్రమే దాఖలు చేసిందని, దీన్నే జడ్జిమెంట్లుగా ఎల్లో మీడియా వక్రీకరిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వలంటీర్ల వ్యవస్థ….. అది కాకపోతే వివేకానంద రెడ్డి హత్య… ఈ రెండు అంశాలపైనే పవన్, చంద్రబాబు విమర్శలు చేస్తారని ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని, మొన్న ఉమెన్ ట్రాఫికింగ్… ఇప్పుడు డేటా అంటూ ఏవేవో ఆరోపణలు పవన్ చేస్తున్నారని, గతంలో వలంటీర్ల వ్యవస్థపై మూటలు మోసే ఉద్యోగం… భర్తలు లేనప్పుడు వెళ్లి వలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని రాంబాబు గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ సమాజంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది కాబట్టి.. ఈ వ్యవస్థను ఏదో ఒక విధంగా నిర్వీర్యం చేయాలని కుట్రతో ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో చంద్రబాబు వెళ్లి పవన్ కల్యాణ్ ను కలవబోతున్నట్లు వచ్చిన వార్తలపై రాంబాబు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు లోకేశ్ ఇంటికి వెళ్తే వార్త అవుతుందా? అలాగే, చంద్రబాబు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్తే వార్త ఎలా అవుతుంది. వీళ్లిద్దరి ఇళ్ళకు రహస్య మార్గాలు ఎప్పుడో ఉన్నాయి. ఎప్పటినుంచో వీరిద్దరూ మంతనాలు చేసుకుంటూనే ఉన్నారు. వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నా కలిసే ప్రయాణం చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దీన్ని ఏదో విధంగా పెద్ద వార్త చేయాలని ఎల్లో మీడియా, చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ రాంబాబు పేర్కొన్నారు.
రాష్ట్రం విడిపోయి సుమారు పదేళ్లు అవుతున్నా బాబు, పవన్ లకు హైదరాబాద్‌లో తప్ప స్వరాష్ట్రంలో సొంత ఇళ్లు లేవని, హైదరాబాద్‌లో నివాసం ఉంటూ రహస్యంగా కలుసుకుంటారని, ఒకరికొకరు వత్తాసు పలుకుతూ ఉంటారని అన్నారు. రామోజీ డైరెక్షన్‌లో, చంద్రబాబు నిర్మాతగా… వలంటీర్ల వ్యవస్థ మీద ఇష్టమొచ్చినట్లు పవన్ మాట్లాడారమని, ఆ తర్వాత చంద్రబాబు పవన్‌కు వత్తాసుగా బయల్దేరారన్నారు.