Wednesday, June 26, 2024
HomeTrending Newsఅధికారుల బదిలీలపై సిఎం ఫోకస్

అధికారుల బదిలీలపై సిఎం ఫోకస్

మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కావడంతో ఇక పాలనా యంత్రాంగంలో మార్పులు, చేర్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై నేడు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, సిఎంవో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీకి వంత పాడిన అధికారులను దూరంగా ఉంచాలని, వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి పంపాలని బాబు నిర్ణయించినట్లు సమాచారం. కీలక శాఖలను సమర్ధంగా నిర్వహించే అధికారుల కోసం బాబు కసరత్తు చేస్తున్నారు. తొలి మార్పు కింద… తిరుమల తిరుపతి దేవష్టానం కార్యనిర్వహణాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె. శ్యామల రావును నియమిస్తూ గత రాత్రే జీవో విడుదల చేశారు.

సిఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీగా మద్దాడ రవిచంద్రను ఇప్పటికే నియమించిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి ఏ.వి. రాజమౌళి ప్రస్తుతం  ఉత్తర ప్రదేశ్ హోం శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఏపీ కేడర్ కు చెందిన మరో అధికారి కార్తికేయ మిశ్రా కేంద్ర ఆర్ధిక శాఖలో డిప్యూటీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. వీరిద్దరినీ డిప్యుటేషన్ పై రాష్ట్రానికి పంపాలని కేంద్రానికి లేఖ రాశారు. వీరిద్దరూ సిఎంవోలో చేరనున్నారు.

సమర్థ అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక పోస్టింగ్స్ ఇవ్వాలని,  అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని బాబు భావిస్తున్నారు.

కాగా, ఈ సాయంత్రం చంద్రబాబు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం లేదా రేపు మరోసారి అధికారులతో చర్చించి సోమవారం నాటికి బదిలీలపై జీవో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్