కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపి బాబుల్ సుప్రియో ఈ రోజు తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీ లోకసభ కార్యాలయంలో ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బాబుల్ సుప్రియో కొద్ది రోజులుగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి రాష్ట్ర నాయకులు అనుసరించిన విధానాలే కారణమని మొదటి నుంచి సుప్రియో విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు ఆగస్టులో జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సుప్రియోకు స్థానం దక్కలేదు. అసన్ సోల్ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున రెండుసార్లు గెలిచిన సుప్రియో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పర్యావరణం, అటవీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
సెప్టెంబర్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన సుప్రియో బిజెపి తరపున గెలిచి టి.ఎం.సి లో కొనసాగటం సరికాదని, తిరిగి ఎంపిగా గెలిచి ప్రజాభిమానం పొందుతానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. తృణముల్ కాంగ్రెస్ లో చేరటం ద్వారా మమత బెనర్జీ నాయకత్వంలో బెంగాల్ ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కిందని సుప్రియో వివరణ ఇచ్చారు.
శాసనసభ ఎన్నికల తర్వాత పార్టీ నుంచి వెళ్ళిన అనేక మంది నాయకుల్ని తిరిగి పార్టీలో చేర్చుకున్న మమత బెనర్జీ ఇతర పార్టీలకు జలక్ ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మిత దేవ్ ను తృణముల్ గూటిలో చేర్చుకొని రాజ్యసభ ఎంపి పదవి కట్టబెట్టారు. ఇప్పుడు బిజెపి ఎంపి బాబుల్ సుప్రియో రావటం ద్వారా ఉత్తర బెంగాల్ లో పార్టీ బలం మరింత పెరగనుంది. ఈ చేరికల అన్నింటి వెనుక రాబోయే త్రిపుర ఎన్నికల్లో తృణముల్ జెండా ఎగుర వేసే లక్ష్యంగా మమత దీదీ పావులు కదుపుతున్నారు.