Friday, April 26, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమైండ్ యువర్ వర్క్

మైండ్ యువర్ వర్క్

Congress Working Committee Meeting

అదొక సువిశాలమయిన భవనం. అందులో కొలువు తీరినది సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ అత్యున్నత పనిచేసే విభాగం. కుర్చీలు, టేబుళ్ల మీద ప్రతీకాత్మకంగా తెల్ల గుడ్డ కప్పారు.

ఏనాడూ పని చేసి ఎరుగని మనుషులతో కూడిన పనిచేసే బృందం…పని ఎలా మొదలు పెట్టాలో తెలియక తికమక పడుతోంది. ఈలోపు వేడి వేడిగా సమోసాలు, పకోడీలు వచ్చాయి. ఒక్కసారిగా గదిలో గంభీరమయిన వాతావరణం ఏర్పడింది. ముందు సమోసా తినాలని కొందరు, పకోడీ ముందు తినాలని మరి కొందరు రెండుగా చీలిపోయారు. దాంతో విధిలేక ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ పెట్టాల్సి వచ్చింది. ఉన్న పాతిక మంది వేసిన ఓట్లలో అయిదు చెల్లలేదు. మిగతా ఇరవై ఓట్లలో సమోసాకు పది, పకోడీకి పది పడ్డంతో అధిష్ఠానం తల పట్టుకుంది. ఈలోపు వేడి వేడి టీ కాఫీలు కూడా వచ్చాయి. ప్రజాస్వామ్యం పనికిరాదని గ్రహించిన పనిచేసే బృందం చల్లారిన సమోసా, పకోడీలు తిని…చల్లారకుండా టీ కాఫీలు తాగారు.ఇక పని మొదలు పెట్టవచ్చు అన్న ఏకాభిప్రాయం కుదరడంతో పనిచేసే బృందం అజెండాను చేపట్టింది.

ఆత్మ విమర్శ పని
పనిచేసే బృందానికి అజెండాలో మొదటి పాయింట్ అర్థరహితమయినదిగా ఏకగ్రీవంగా అనిపించి…ఆ పాయింట్ ను అప్పటికప్పుడు డిలిట్ చేసేశారు. ఆత్మ విమర్శ అన్నది మన ఇంటా ఒంటా లేనప్పుడు…కొత్తగా ఈ అలవాటు దేనికి? అన్న వాదన సహేతుకమయినదే.

పర విమర్శ పని
మొత్తం ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు అధికారపక్షమే కారణం అని పర విమర్శ పని ఘనంగా జరిగింది.

పరస్పర విమర్శ పని
ఈలోపు పనిచేసే ఎనభై ఏళ్ల పచ్చి యువకుడు పర విమర్శ విషయంలో అధిష్ఠానంతో సైద్ధాంతికంగా విభేదించాడు. దాంతో పని చేయని వారందరూ పని చేసే సీనియర్ మోస్ట్ యువకుడి మీద విరుచుకుపడ్డారు. పరస్పర విమర్శల పని ఎంతకూ పూర్తి కాకపోవడంతో…తెలివిగా అధిష్ఠానం భోజనం పని పెట్టింది.

కుటుంబం పని
పార్టీ బాధ్యతలు వద్దని కుటుంబం ప్రకటించింది. కుటుంబమే దిక్కని పనిచేసే బృందం ప్రార్థించింది. అయిష్టంగా పార్టీ పనిని కుటుంబం పనిగా కుటుంబం అంగీకరించక తప్పలేదు.పార్టీ పని
పార్టీ ఆఫీసుల్లో కరెంటు బిల్లులు కట్టడానికి కూడా డబ్బుల్లేవు కాబట్టి…డబ్బున్న వారే పార్టీ పనులు చూసుకోవాలని పనిచేసే విభాగం తన పని కాదని హుందాగా తప్పుకుంది.

ఎన్నికల పని
నాలుగయిదు తరాలుగా ఎన్నికలను చూసిన తమకు ఇప్పుడు కొత్తగా ఎన్నికల పనులను ఒకరు నేర్పాల్సిన అవసరం లేదన్న వాదనతో పనిచేసే విభాగం పూర్తిగా ఏకీభవించి…ఈ పాయింటును కూడా అజెండా నుండి తొలగించేశారు.

పొత్తుల పని
తమతో పొత్తు పెట్టుకున్నవారూ మునిగి; పొత్తు వల్ల తామూ మునుగుతున్నప్పుడు…మునక కామన్ కాబట్టి ఈ విషయం మునిగినప్పటి లోతును బట్టి చర్చిద్దాములెమ్మని ఈ పాయింట్ మీద చర్చను ప్రస్తుతానికి వాయిదా వేశారు.

డబ్బు పని
పార్టీలో నాయకులు అత్యంత సంపన్నులై, పార్టీ కటిక దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతూ ఉండడం అనుభవమే కాబట్టి…అన్ని రాష్ట్రాల్లో అత్యంత నిరుపేదలకే పార్టీ బాధ్యతలను ఇవ్వాలని ఒక విధానపరమైన నిర్ణయానికి పని చేసే విభాగం ఆమోదం తెలిపింది.

చేసే పని
నిజంగా ఫీల్డ్ మీద పనిచేసి సర్వస్వమ్ కోల్పోయేది కార్యకర్తలు. కాబట్టి పని చేసే వారికి పని, పని చేయని వారికి పదవులు ఇవ్వాలన్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమయ్యింది.

చూసే పని
వివిధ రాష్ట్రాలకు ఇన్ ఛార్జ్ లను కొత్తగా నియమించారు. వారి బాధ్యత కేవలం చూడడం వరకే. శిథిలమవుతున్న పార్టీ బృహత్ సౌధాల పిక్స్, వీడియోలను వారు ఎప్పటికప్పుడు చూస్తూ…వీలయితే సెల్ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే బాగుంటుందని పని చేసే విభాగం అభిప్రాయపడింది.

వినే పని
పార్టీలో ఎవరి మాట ఎవరూ వినరు కాబట్టి…వినే పనే పెట్టుకోకూడదని మూజువాణి ఓటుతో ఒక నిర్ణయం తీసుకున్నారు.

పనిలేని పని
అజెండాలో చివరి అంశంగా పనిలేని వారిని గుర్తించి వారికి పని కల్పించాలి అనుకున్నారు. కొంత చర్చ తరువాత ఎవరికీ పనిలేదని తేలడంతో కొత్తగా పని కల్పించే పని పెట్టుకోకూడదని పనిచేసే విభాగం నిర్ణయం తీసుకుంది.

ఓట్ ఆఫ్ థాంక్స్
ఓటు వేసినవారికి థాంక్స్ చెప్పే అలవాటు లేదు కాబట్టి…పనిచేసే విభాగంలో ఎనభై…తొంభై ఏళ్ల నవ యువకులు ప్రాణాలకు తెగించి ఈ మీటింగ్ కు వచ్చినందుకు యావత్ జాతి ఓటర్లు తమకే థాంక్స్ చెప్పాలన్న తీర్మానం మీద చర్చతో పనిచేసే విభాగం సుదీర్ఘ సమావేశం ముగిసింది.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

అంతఃపుర కలహాలు అంతర్గత యుద్ధాలు

Also Read:

పి వి చెప్పే పాఠం

Also Read:

ప్రజలు గెలిచేదెప్పుడు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్