Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

కమ్యూనిజం అనేది నిరంతరం మానవజాతి సమస్యలపై స్పందించే గొప్ప విధానమని, అనేకమంది మేధావులు పదును పెట్టి మానవజాతిని దోపిడీ నుంచి విముక్తి చేసే గొప్ప సిద్ధాంతమే మార్క్సిజం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట యోధులు కరీంనగర్ జిల్లా మొదటి పార్లమెంట్ సభ్యులు బద్దం ఎల్లారెడ్డి 44వ వర్ధంతి సభలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వినోద్ కుమార్ మాట్లాడారు.

వామపక్ష నాయకులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది పోరాటాల వల్లనే దేశంలో, రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలకు కారణం కమ్యూనిస్టుల పోరాటాలేనని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించలేక పోతే.. ప్రజలు ఎక్కడ తిరగబడతారో అన్న అభద్రత ఆయా ప్రభుత్వాలలో కలగడం వల్లనే సంక్షేమ పథకాలు అమలుకు కారణమని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

ఎవరికైనా అధికారం ముఖ్యం కాదని, వ్యవస్థ ధ్వంసం కావొద్దు అని వినోద్ కుమార్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వినోద్ కుమార్ అన్నారు. ప్రస్తుతం దేశంలో కుహన దేశభక్తులు ప్రమాదకరంగా మారారు అని అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. అందులో ముఖ్యంగా బిజెపి అనుసరిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారాయని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

భిన్న మతాలు భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలో కులాలు, మతాల పేరిట దేశభక్తి పేరిట విభజించు పాలించు పద్ధతిలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని లక్షలాది కోట్ల విలువైన సంపదను కేంద్ర ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందని దేశంలోని ప్రజలకు అన్యాయానికి గురి చేస్తోందని వినోద్ కుమార్ అన్నారు. దేశ సంపదను అప్పనంగా అంబానీ, ఆదానీలకు కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తుందని వినోద్ కుమార్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో నయాభారత్ నిర్మాణం కోసం అడుగులు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రజా గాయకురాలు విమలక్క, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com