Saturday, July 27, 2024
HomeTrending Newsతెలంగాణలో దొంగలు పడ్డారు -బండి సంజయ్

తెలంగాణలో దొంగలు పడ్డారు -బండి సంజయ్

బీఆర్ఎస్ లో ఆంధ్రా నాయకుల చేరిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నారని బండి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్ ఫ్యాక్టరీలను మూసేసి తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు కేంద్రం ప్రైవేటికరణను ప్రోత్సహిస్తోందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఉద్యమంలో చెప్పిన అజాంజాహీ మిల్లు ఏమైందని ఆయన అడిగారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తుల్ని కేసీఆర్ అమ్ముకుంటున్నారని బండి ఆరోపించారు. ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్ రగిలించి, ఆంధ్రావాళ్లను తిట్టి జై తెలంగాణ పేరుతో ఓట్లేయించుకున్న కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రాలో ఓట్ల కోసం జై తెలంగాణ అన్న నినాదాన్ని కూడా పలకలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఆంధ్ర ప్రజల ఆహారాల్ని ఎగతాళిగా మాట్లాడి రాక్షసానందం పొందిన విషయాన్ని అక్కడి ప్రజలు మరిచిపోగలరా అని సంజయ్ అన్నారు. పెండ బిర్యానీ అని, ఉలవచారును ఇక్కడ పశువులు తింటాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని వాళ్లేవిధంగా జీర్జించుకుంటారని సంజయ్ అన్నారు.

రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా రాష్ట్రంలో ఎక్కడ ఉందని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ సంస్థలు రూ.60 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని సంజయ్ చెప్పారు. కేవలం ప్రభుత్వ శాఖలే రూ.20 వేల కోట్లు బాకీ పడ్డాయని గుర్తు చేశారు. పొలం కాడ ఫ్రీ ఇస్తూ, ఇంట్లో కరెంట్ ఛార్జీలు పెంచారని బండి ఆరోపించారు. నీటి పారుదల రంగంలో కేసీఆర్ రాష్ట్రానికి తీరని ఆన్యాయం చేశారని బండి విమర్శించారు. 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్షా 30 వేల కోట్లకు పెంచి నిర్మించినప్పటికీ అదనంగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదని ఆయన పేర్కొన్నారు. పైగా మొన్నటి వర్షాలకు ప్రాజెక్టు పంపుసెట్లు మునిగిపోయాయని అన్నారు. ఆంధ్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కేసీఆర్ వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్ వి అన్ని గుంటనక్క గుణాలే అని, గుంట నక్క శాఖాహారీగా మారిందంటే ఎవరైనా నమ్ముతారా అని ఆయన అన్నారు. కేసీఆర్ స్వయం ప్రకటిత మేధావి, ఇంజనీర్, ప్యారసిటమాల్ డాక్టర్ అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీ నిధుల విషయంలో తెలంగాణలో దొంగలు పడ్డారని, ఆ దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని దేశం అంతా చర్చ జరుగుతోందని సంజయ్ ఎద్దేవా చేశారు. త్వరలోనే సర్పంచిలంతా తిరగబడటం ఖాయం అని చెప్పారు. వెంటనే దారి మళ్లించిన గ్రామ పంచాయతీ నిధుల్ని డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్ర సర్పంచిలు బీఆర్ఎస్ లో చేరతున్నారని కేసీఆర్ పత్రికల్లో రాసుకుంటే అక్కడి వాళ్లు ఖండించారని సంజయ్ గుర్తు చేశారు. వాస్తవాల్ని దాచలేరని ఆయన అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్