తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసీ) ఛైర్మన్ గా టిఆర్ఎస్  సీనియర్ నేత,  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు నేడు ఉత్తర్వులు వెలువడ నున్నాయి.

దివంగత డాక్టర్ వైఎస్సార్ ప్రభావంతో, డిఎస్ శిష్యుడిగా కాంగ్రెస్ లో రాజకీయ ప్రవేశం చేసిన బాజిరెడ్డి 1999లో తొలిసారి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004 లో బాన్స్ వాడ నుంచి నేటి స్పీకర్, నాటి టిడిపి అభ్యర్ధి పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడించి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 లో ఓటమి పాలయ్యారు గోవర్ధన్. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణపై పార్టీ  వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి 2014 ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ లో చేరారు. నిజామాబాద్ రూరల్ టికెట్ ను బాజిరెడ్డికి కేటాయించారు కెసియార్. ఆ ఎన్నికల్లో తన రాజకీయ గురువు డిఎస్ ను ఓడించి చరిత్ర సృష్టించారు. అదే నియోజకవర్గం నుంచి రెండోసారి 2018 లో కూడా 29, 646 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధి ఆర్. భూపతి రెడ్డిపై విజయం సాధించారు.

సీనియర్ నేతగా ఉన్న తనకు అమాత్య పదవి వస్తుందని ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు ఆ యోగం దక్కలేదు. తాజాగా బాజిరెడ్డిని ప్రతిష్టాత్మకమైన ఆర్టీసీ చైర్మన్ గా కెసిఆర్ నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *