Saturday, January 18, 2025
HomeTrending Newsఎన్నికల బరిలో వినేష్ ఫోగట్..బజరంగ్‌ పునియా

ఎన్నికల బరిలో వినేష్ ఫోగట్..బజరంగ్‌ పునియా

హర్యానా రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటివరకూ బరిలో ప్రత్యర్థులను మట్టి కరిపించి సత్తా చాటిన రెజ్లర్లు బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌ ఇద్దరూ కాంగ్రెస్‌ అగ్రనేత ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని ఈ రోజు(బుధవారం) ఢిల్లీలో కలిశారు. భేటీకి సంబంధించిన ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. ‘వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ను కలిశారు’ అంటూ ట్వీట్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. హర్యానా ఎన్నికల్లో వీరిని పోటీకి దింపే అవకాశం బలంగా ఉందని చర్చ జరగుతోంది.

హర్యానాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి పదవికి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గంలో ఇటీవలే చేరారు. ప్రస్తుత సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు చేపట్టారు. వచ్చే నెలలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా రెజ్లర్లు కాంగ్రెస్ లో చేరటం కొంత ఇబ్బందికరమే అని విశ్లేషకులు అంటున్నారు. తొలుత అక్టోబర్‌ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్‌ 2న బిష్ణోయ్‌ సామాజిక వర్గ శతాబ్దాల నాటి పండుగను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీని అక్టోబర్‌ 5కు మార్చింది. అక్టోబర్‌ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

హర్యానాలో బిజెపిని గద్దె దించటమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. రాష్ట్రంలోని 90 స్థానాల్లో ఆప్, సమాజ్ వాది పార్టీలకు 5 సీట్ల వరకు ఇచ్చి మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసేలా చర్చలు జరుగుతున్నాయి. దాద్రి నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపనున్నారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో బిజెపి టికెట్ మీద బబిత ఫోగట్ పోటీ చేసే ఓడిపోయారు.  అదే సమయంలో జులాన శాసనసభ స్థానం నుంచి పోటీకి దిగుతారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బజరంగ్ పునియా బబ్లి అసెంబ్లీ స్థానం నుంచి హస్తం గుర్తుపై బరిలోకి దిగుతారని అంటున్నారు.

ఇద్దరు రెజ్లర్లు ఢిల్లీలో రైతుల ఆందోళనకు బేషరతుగా మద్దతు ఇచ్చారు. రెజ్లర్ కోచ్, బిజెపి ఎంపి బ్రిజబుషణ్ సింగ్ వ్యవహారంతో రేజలర్లకు కేంద్రప్రభుత్వంతో విబేధాలు ముదిరాయి. క్రమంగా ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యవహారంలో కేంద్రం మొండి వ్యవహారంతో లోక్ సభ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది.

లోక్‌సభ ఎన్నికల సమయంలో జాట్‌లు, రైతులు తమ అసంతృప్తి వ్యక్తం చేయడంతో కాంగ్రెస్‌కు లాభం చేకూరింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని ప్రాథమిక సమాచారం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్