Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకొమురయ్య ముల్లె

కొమురయ్య ముల్లె

Our Roots: “ఆ సంచిలో ఏమున్నదో బంగారం, ఏప్పుడు దాన్ని జూసి మురుస్తా ఉంటడు” … సణుగుతారు పొలం పనులు చేసుకుంటూ. గయితే కొమురయ్య మనకేం జెప్పలే. మనం కొమురయ్యనేం అడగలే. జెప్పకుండానే సాగి పోయిండు.

నటనా, నటులూ లేనీ సైన్మా జూసిన. మనుషుల్నీ, మావిపూత పూసినట్లుండె మనసుల్నీ జూసిన. తనలోని కలుపు తనే పీకి పారేసి, ఎచ్చంగ  కన్నీరు గార్చి, పచ్చంగ నవ్వే పైర్ని జూసిన. ‘గోడగట్టని గూడులాంటి పల్లె’ని జూసినా. పల్లెతో బాటు, బలరామ నరసయ బైలెల్లే బంగారు తొవ్వ జూసిన. నిన్నపొద్దు పొద్దుగాల చాయ జప్పరిస్త ఓటీటీల బలగం జూసిన…తనివిదీరా ఏడ్సినా. ముఖం గడుక్కుని ఆఫీస్కి వోయిన. దినమంతానిమ్మలంగాఉన్నా.

వొంకలల్ల డొంకలల్ల పాయలుపాయలుగా సీలిపోయి మళ్లా గల్సిపోయి, బలంగా పారే వాగుని జూసిన. స్వార్థాలూ, ఆశలూ, అహంకారాలు, పట్టింపు లసంటి డొంకల్లో సీలి పేలికలైనా, మళ్ళీ తాడు పేనినట్లు, చినుకు చినుకు గల్సి గురిసినట్టు, ఒక్కటిగ పెనేస్కుకునే ‘బురద నెత్తుటి మమకారం’ జూసిన..బలగంజూసిన.

ఇందుల పాత్రల్లేవ్. మనిండ్లల్ల ఉండే అత్త మామలే.  అల్లుళ్లే సెల్లెళ్లే. అన్నలే, తాతలే మరదళ్లే.  దోస్తులే. ఆళ్ళు గట్లనే మాట్లాడ్తారు.కొట్లాడ్తారు.వర్లుతారు,మర్లుతారు. అంతలోనే గల్సి పోతరు. ఎవులెప్పుడు కథని ఎసుంటి మల్పు దిప్పుతరో తెల్వద్. గసుంటి పాత్రలకి మాటల్రాసుడి శానా కష్టం. యెల్దండి వేణూ …  ఏం రాసినవ్రా భయ్. నీ టీం కో సలాం. సావు సీన్ని దీస్కొని సచ్చే దాకా యాది కుండే సిన్మా దీసినవ్  జూడు… నువ్వు గ్రేట్ రా  భయ్! కొమురయ్యని,ముసిలోని సరసాన్ని,అజరామరం జేసినవ్. సావులో హాస్యం జేసినవ్ జూడు.. గదైతే  వేరే లెవల్.

పాత్రల్ శానానే ఉన్నయ్ గాని ఎక్కడా రవ్వంత గూడ పరేషాన్ లేదు. దిమాగ్ ఖరాబ్ గాదు. అస్సల్, చిన్న చిన్న పాత్రలే కథని పెద్ద మలుపులు దిప్పుతయ్. కొమురయ్య సెల్లె అసుంటి పాత్ర. ఆళ్లేదో జెయ్యాలని జెయ్యరు. ఆళ్ళ సోదే అంత. ఓ పొల్లు మాట, ఓ ఎకసెక్కెం, ఓ నొసటి ఎక్కిరింపు, ఈసడింపు జాలు కథ మారి పోనీకి…ఇజ్జత్లు దావత్లు పోటీ పడనీకి.…కంటి జూపుల్తనే జంపుకోనీకి. గట్లనే కొమురయ్య తమ్ముడు గూడా యాదిలోంచి పోడు. ఇక పెద్ద పాత్రల్ జూపించిన విశ్వరూపం జెప్పఁనీకి రాదురా భయ్.

పిట్ట పిండం ముట్ట లేదన్న దిగులు అందర్ని కట్టి పడేస్తది అనుకుంటాం గాని, నిజానికి ఆళ్ళని గలిపేది దిల్లులల్ల ఉండే ప్యార్, జేసిన తప్పుల్ని దెల్సుకోవడం. గా ప్యార్ని పైకి దీనీకి ‘ఒగ్గుకథ’లూ, ‘కథ జెప్పే మొగిళి’, కొమురమ్మ ల్త జెప్పించిన బుడగా జంగాల ‘కొమురయ్య బుర్రకత’లూ సిన్మా కే హైలెట్. ఏడ్వనీకి కళ్ళల్ల నీళ్లు జాలవు. కళ్ళు కాల్వలే అయినయ్.ఎడ్వనీకి ఎవులన్న సిన్మా కోస్తార్రా భయ్…నువ్ రప్పిస్తున్నవ్. ఏడ్సి ఏడ్సి ఖుష్ అయితున్రురా భయ్.  గిదేమి గమ్మత్తి రా. వేణుగా … నువ్ మామూలోడివి గాదు.

ఇక పాటల్ జూడు…ఎక్కడికో దీస్కు పోయినావురా అన్నా …కాసర్ల శ్యామ్!  ‘మమతల ముల్లె .. పల్లె’ ని కళ్ళకి జూపించినవ్, చెవులకి వినిపించినవ్, రుచి జూపించినవ్, మట్టి వాసనని మనసుకి దట్టించినవ్.   బలరామ నరసయో పాటతో ఆత్మని దాఁకినవ్. ఏ వేదాంతీ రాసిన తత్వానికి దక్కువ కాదురా భయ్. ఇక రానున్న సావులల్లో  సచ్చే దాకా మోగుతాది. ఇది సత్తెం.ఇక రామ్ మిర్యాల, మంగ్లీ, వేణు, భీమ్స్ గొంతులల్ల తేనెలే. సెవులల్లో పోసుకొని పోసుకొని చీమలు పడుతున్నయ్.

వేణు స్క్రిప్ట్ అద్భుతం. ‘ఏ నిముషానికి ఏమి జరుగునో’ పాట,కొమురయ్య రావి చెట్టు కింద కూసోగానే కాకి అరవడం, ‘అందరు ఫోటోలు దిగుతారు తాతకి  ఒక్కటన్నా దింపాల గదా’ అని సాయిలు అనుకోవడం, కొమురయ్యకి గోరీ గట్టాలనే సీన్ల …చెట్టుకి కొమురయ్య ముల్లె వేలాడుతూ కనపడటం, ఏమ్ సింబాలిజం రా భయ్! ఇఛ్చి పడేసినవ్.

కొమురయ్య ముల్లె ఏలాడిన రావి చెట్టు కిందే సాయిలు గానికి జ్ఞానోదయం అయితది. చెట్టు కింద ఎరుక వచ్చుడు మనకి ఎరుకే. తాత కోసం సంటి  పిలగాని లెక్క ఏడిసే  సాయిలు ఏడ్పులో వాని లోని ‘సావు తెల్వితేటలు’ కొట్టక పోతాయి. కొమురయ్య ముల్లె లో దాచుకున్నదీ, అందరి దిల్ లల్ల ఉన్నదీ ఒక్కటే. అదే బలగం. కొమురయ్య ఒంటిపిట్ట లెక్క పోలే. కొమురయ్య బలగం తో సంబురంగా సాగినాడు.

ఈ సిన్మాకి లెక్కలు గట్టి రివ్యూ రాసేనీకి రాదు. చూసి ఏడ్సాల్సిందే… ఏడుపంటే మామూలు ఏడుపు కాదు నిన్ను లోపలనించి కడిగి పారేసే ఏడుపు. సిత్తం శుద్ధి పడే ఏడుపు.

– విప్పగుంట రామ మనోహర

Also Read :

ఆదిభట్లను కొలిచే రాళ్లున్నాయా?

Also Read :

పల్లె పన్నీరు చల్లుతోందో…

RELATED ARTICLES

Most Popular

న్యూస్