భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  ఎల్వీఎం3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలకు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. నేటి ప్రయోగం ద్వారా అంతర్జాతీయ స్పేస్ టెక్నాలజీ రంగంలో మరోసారి తన సత్తా ఏమిటో ఇస్రో ప్రపంచానికి తెలియజేప్పిందని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధనలో ఇది మరో మైలురాయిగా నిలిచిపోతుందని సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, నేటి ఉదయం ఇస్తరో పంపిన 36 ఉపగ్రహాలను ఎల్వీఎం3 రాకెట్ సురక్షితంగా కక్ష్యలోకి చేర్చింది. శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) నుంచి ఎల్వీఎం3 రాకెట్ ప్రయోగం జరిగింది. షెడ్యూల్ మేరకే ఉ 9 గం.లకు షార్ నుంచి ఎల్వీఎం3 వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలతో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 20 ని. ల తర్వాత భూఉపరితలం నుంచి 450 కి.మి చేరుకొని లో ఎర్త్ ఆర్బిట్ [వృత్తాకార కక్ష్య] లోకి ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా ప్రవేశపెట్టింది. కాగా, ఎల్వీఎం3 ఎం3 రాకెట్ ఎత్తు 43.5 మీ. బరువు 643 టన్నులు. 36 ఉపగ్రహాల బరువు 5.8 టన్నులు. ఇస్రోకు చెందిన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌, వన్ వెబ్ ల మధ్య మొత్తం 72 ఉపగ్రహాలను నింగిలోకి చేర్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా గతేడాది అక్టోబరు 23 న మొదటి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చింది. తాజాగా మిగతా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *