Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం"పాదరక్షక" బిరుదాంకిత బలిజేపల్లి

“పాదరక్షక” బిరుదాంకిత బలిజేపల్లి

Drama-Dedication: నా కెమెరా వృత్తిలో భాగంగా ఒక వారం రోజులపాటు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న 2022 నంది నాటక పోటీల్లో పాల్గొనే అవకాశం దొరికింది. ప్రఖ్యాత హిందూ కాలేజీ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటకాల ప్రదర్శనలు. “శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రాంగణం” అని ఈ మందిరానికి పేరు పెట్టారు.

రోడ్డుకు అటు హిందూ కాలేజి. ఇటు నాటకాల పోటీలు. నాటకాలకు వచ్చినవారిలో ఎవరో ఒకరు హిందూ కాలేజీ గొప్పతనం గురించి…అందులో పాఠాలు చెప్పిన అధ్యాపకులు, చదువుకున్న విద్యార్థుల ప్రతిభా విశేషాల గురించి మైమరచి చెబుతుంటే మళ్లీ మళ్లీ వినాలనిపించింది.

తెలుగు నాటకానికి ఆచంద్రతారార్కమైన కీర్తిని ప్రసాదించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి హిందూ కాలేజీలో స్వాతంత్య్రం రావడానికి పూర్వం తెలుగు పాఠాలు చెప్పారు. ఇప్పటి తరానికి బలిజేపల్లి ఎవరో తెలియకపోవచ్చు. తెలుగు నాటకం బంగారు పల్లకిలో ఊరేగిన 1970, 80ల వరకు బలిజేపల్లి పేరు మారుమోగేది. ఆయన రాసి స్వయంగా సత్యహరిశ్చంద్ర లేదా నక్షత్రకుడి పాత్రలో నటించిన నాటకంతో హరిశ్చంద్రుడు పదహారణాల తెలుగువాడైపోయాడు. నక్షత్రకుడు మన ఊరివాడయ్యాడు.

సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించని ఊరు తెలుగు నేల మీద బహుశా ఉండదు.
“భక్తయోగ పదన్యాసి వారణాసి…”
“తిరమై సంపదలెల్ల..” పద్యాలు అందులోనివే. నాటకాన్ని సినిమా మింగనంతవరకు, మూడు యుగాలు గడచినా పూర్తి కాని సీరియళ్లతో టీవీలు వేయి తలలుగా విస్తరించనంతవరకు నాటకం పద్యాలు వినేవారు ఉండేవారు. డి వి సుబ్బారావు, చీమకుర్తి నాగేశ్వర రావు లాంటి మేరునగధీరులయిన నటులు స్టేజ్ మీద నాటకంలో పద్యానికి ప్రాణం పోశారు. తెలుగు పద్యనాటకానికి అజరామరమయిన కీర్తి కిరీటం పెట్టారు. పద్యం కంటే… పద్యం చివర వారు తీసిన అనంతమయిన రాగానికి ఒన్స్ మోర్లు, ఈలలు, కేకలు, మెడలో నోట్ల దండలు, పూల దండలు. చప్పట్లే చప్పట్లు. స్టూడియోల్లో యాంత్రికంగా ఎకోలు, కోరస్ లు పెంచడం తెలియని రోజుల్లో నటుడు నాటకంలో పద్యం గొంతెత్తి పాడితే మైక్ లేకపోయినా ఊరు ఊరంతా వినగలిగేది. అదొక స్వర్ణ యుగం.

చెల్లియో చెల్లకో…
బావా ఎప్పుడు వచ్చితివి?
యేనుంగునెక్కి…
ధారుణి రాజ్యసంపద…
జెండాపై కపిరాజు…
లాంటి పద్యాలు కేవలం నాటకాలవల్లే జనం నోళ్లల్లో శతాబ్దాలపాటు బతికాయి. చదువురాని సామాన్యుల్లో కూడా ఈ పద్యాలు పట్టుచీర కట్టుకుని సగర్వంగా నిలబడ్డాయి. రకరకాల కారణాలవల్ల తెలుగునాటకం ఒకానొక అమావాస్య అర్ధరాత్రి స్టేజీ తెరకే ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది. అది ఆత్మహత్య కాదు- అక్షరాలా హత్య అని తరువాత పోస్ట్ మార్టంలో రుజువయ్యింది.

ఇప్పుడు బలిజేపల్లులు పుట్టలేరు. పుట్టినా మనం పట్టించుకోము. ఆయన పుట్టింది బాపట్ల దగ్గర ఇటికెంపాడులో(1881). చదువుకున్నది కర్నూల్లో. ఉద్యోగం హిందూ కాలేజీలో. స్వాతంత్య్ర సమరయోధుడు. అవధాని. పండితుడు. కవి. నాటక రచయిత. నటుడు. గాయకుడు. సమరయోధుడిగా రెండేళ్లు జైల్లో ఉన్నప్పుడు 1912లో రాసినది సత్యహరిశ్చంద్ర నాటకం.  1945 నాటికే సత్యహరిశ్చంద్ర నాటకం పుస్తకాలు లక్ష ప్రతులు అమ్ముడు పోయాయి. ఈ నాటకంలో బలిజేపల్లి వేషం వేసి గొంతెత్తి పద్యం పాడుతుంటే కుంభవృష్టి కురుస్తున్నా…జనం కదిలి వెళ్లేవారు కారట. కొంతకాలం సినిమాలకు మాటలు, పాటలు, పద్యాలు రాశారు. నటించారు. చివరిలో పూర్తి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లి, ఐదు వేలకు పైగా పద్యాలతో సుందరకాండ కావ్యాన్ని రచించారు. శ్రీకాళహస్తిలో చిన్న కుటీరంలో ప్రశాంత జీవనం గడుపుతూ డెబ్బై రెండవ ఏట (1953లో) కన్ను మూశారు.

ఆయనకు “పాదరక్షక” బిరుదు రావడం వెనుక ఒళ్లు పులకించే కథ ఉంది. స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన యథార్థ సంఘటన ఇది. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్య హరిశ్చన్ద్ర నాటకం చిత్తూరు ప్రాంతంలో ప్రదర్శిస్తున్నారు. హరిశ్చంద్రుడిని అడుగడుగునా పట్టి పీడించే నక్షత్రకుడి పాత్రలో స్వయంగా బలిజేపల్లి వారే నటిస్తున్నారు. ముందువరుసలో కూర్చున్న తెలుగు తెలిసిన రసజ్ఞుడయిన ఒక బ్రిటీషు అధికారి నాటకంలో లీనమై కోపం పట్టలేక నక్షత్రుకుడి వేషంలో ఉన్న బలిజేపల్లి మీదికి ఉరికి వెళ్లి, కాలిలో చెప్పు తీసి… ఒరేయ్ ఎంత దుర్మార్గుడివిరా నువ్వు? అంతటి హరిశ్చంద్రుడిని ఇంతగా హింసిస్తావా? అవమానిస్తావా? అని ఆయనమీదికి చెప్పు విసిరాడు. ఈలోపు ప్రేక్షకుల్లో కలకలం. నాటకం ఆగిపోయింది. ఒక్క క్షణంలో ఆ అధికారి తేరుకుని, బలిజేపల్లిని క్షమించమని వేడుకున్నాడు. బలిజేపల్లి నవ్వుకున్నాడు. తన నటనకు తానే పొంగిపోయాడు. చెప్పు దెబ్బలు గొప్ప గౌరవంగా భావించాడు. ఇంకో చెప్పు కూడా కలిపి హారంగా మెడలో వేయించుకున్నాడు.

ఆరోజునుండి బలిజేపల్లి పేరు ముందు “పాదరక్షక బిరుదాంకిత” అయ్యింది. బలిజేపల్లి లక్ష్మీకాంత కవికి పాదరక్షక బిరుదు వచ్చిన ఈ సంఘటనను మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు రాయలసీమలో కథలు కథలుగా చెప్పుకునేవారు.

సత్యహరిశ్చంద్రలో బలిజేపల్లి రాసి పాడిన ఒక పద్యాన్ని ఇప్పటితరం గాయకుడు దాదాపు అలాగే పాడిన వీడియో ఇది. ఒకనాడు తెలుగు పద్యం తీసిన రాగంలో రాళ్లు కరిగి ప్రవహించిన సందర్భాలు ఎంత రసమయంగా, గంగాప్రవాహంగా ఉండేవో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్లి Journey of Praveen EP-24-2nd round అని టైప్ చేసి విని పరవశించండి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్