Friday, March 29, 2024
HomeTrending NewsBalochistan: నివురుగప్పిన నిప్పులా బెలుచిస్థాన్

Balochistan: నివురుగప్పిన నిప్పులా బెలుచిస్థాన్

బెలుచిస్థాన్ అపారమైన సహజవనరులకు ప్రసిద్ది. భూ విస్తీర్ణంలో పాకిస్తాన్లో పెద్ద రాష్ట్రం, ఖనిజ సంపదల్లో బెలోచిస్తాన్ ఆ దేశానికి బంగారు గని లాంటిది. అయితే సంపద పంపిణీలో ఈ రోజు వరకు ఫెడరల్ ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా రావటం లేదు.

రాష్ట్ర ప్రభుత్వంలో అసమర్థ నాయకుల ఏలుబడితో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. దీంతో బెలుచిస్థాన్ లో పేదరికం రోజు రోజుకు పెరిగిపోతోంది. నిరుద్యోగం, అవినీతి, వ్యవసాయానికి యోగ్యమైన భూమి తక్కువగా ఉండటం స్థానికుల పాలిట శాపంగా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది.

ఆ దేశ జియోలాజికల్ సర్వే సంస్థ వివరాల ప్రకారం 80 రకాల ఖనిజ నిల్వలు సమృద్దిగా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమె వెలికి తీయగా ప్రభుత్వ విధానాలు సరిగా లేక మరెన్నో అలాగే ఉండిపోయాయి. బంగారం, కాపర్, జింక్, సిల్వర్ నిల్వలతో పాటు సహజవాయువు నిల్వలు బలూచ్ లో తగినంతగా ఉన్నాయి.

దుద్దేర్, సైనదాక్, రీకో-డిక్ గనుల్లో మైనింగ్ జరుగుతోంది. వాటిలో మొదటి రెండు చైనా కు చెందిన మేటలర్జికల్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (MCC) ఆదీనంలో నడుస్తున్నాయి. MCC – పాకిస్తాన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిసి ఈ గనుల్ని నిర్వహిస్తోంది. రీకో- డిక్ గని న్యాయ పరమైన చిక్కుల్లో పడి పాకిస్తాన్ 6 బిలియన్ ల రాబడి చేజార్చుకొంది.

పాక్ స్వార్థం – చైనా దోపిడీ
పాలకుల స్వార్థ పూరిత విధానాలతో బెలుచ్ ప్రజా సంక్షేమానికి వాటా దక్కడం లేదు. సైనదాక్ గనిలో రాష్ట్ర ప్రభుత్వానికి ౩౦ శాతం వాటా వస్తుండగా, దుద్దర్ గనిలో నష్టాల పేరుతో కేవలం 10 శాతం వాటా చైనా కంపెనీ ముట్టచెబుతోంది. గనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించక కార్మికులు చనిపోవటం నిత్యకృత్యంగా మారింది. బెలుచ్ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం గనుల దగ్గరికి వెళ్ళే రోడ్ ల నిర్వహణకే సరిపోతోంది. ప్రజా సంక్షేమానికి అరకొరగా నిధులు ఖర్చు చేస్తూ, స్థానిక నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వంలోని పెద్దల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని చైనా కంపెనీలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

 

గ్వధార్ ఓడరేవు నిర్మించిన చైనా, బలూచ్ ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓడరేవులో స్థానికులకు ఉపాధి కల్పించాలని నేతలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చైనా కంపనీ లు, పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.

పైగా బెలుచ్ అసంతృప్త వాదుల నుంచి ముప్పు పొంచి ఉందని పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాల్ని మోహరించింది. చైనా కంపని లు వచ్చినప్పటి నుంచి బెలుచ్ లో దోపిడీ మరింత పెరిగి పోయింది.

నిధుల పంపిణీలో వివక్ష – మిలిటరీ ఆగడాలు
దేశ సంపదలో సరైన వాటా దక్కక అనేక సార్లు తిరుగుబాటు జరిగిన సందర్బాలు ఉన్నాయి. భారత–పాక్ ఏర్పాటు సమయంలో రాజధాని క్వెట్టా తో పాటు ఇతర నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయగా భారత దేశంలో విలీనం చేయాలనే డిమాండ్లు కూడా ఎక్కువగానే వచ్చాయి. భౌగోళికంగా భారత్ లో విలీనం సాథ్యం కాదని ఆ డిమాండ్ పక్కన పెట్టేశారు.

 

ఈ ప్రాంతంలో అభివృద్దికి నిధులు కేటాయించక పోగా మిలిటరీ స్థావరాలు పెంచుతున్నారని బలుచ్ నేత నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తి , మీర్ నవాబ్ మర్రి లు అనేక సార్లు నిరసన వ్యక్తం చేశారు. బెలుచ్ ప్రజలను ఆదుకోవాలని పాక్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించారు. 2006 లో పర్వేజ్ ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాక్ మిలిటరీ కి బలూచ్ తిరుగుబాటు వర్గాలకు మధ్య జరిగిన గొడవల్లో బుగ్తి మరణించారు. పాక్ మిలిటరీ నే చర్చల పేరు తో రప్పించి కాల్చి చంపిందనే అనుమానం బెలుచ్ ప్రజల్లో నాటుకు పోయింది.

 

ఆనాటి నుంచి బెలుచ్ ప్రజల తరపున నాయకత్వ భాద్యతలు తీసుకునే నేతలు లేక పోగా పాక్ కొమ్ము కాసే నేతలు పెరిగిపోయారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కిడ్నాప్ చేసి చంపటం, ఎన్కౌంటర్ చేయటం క్వెట్టా తో పాటు ఇతర నగరాల్లో సాధారణంగా మారింది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని క్వెట్టాలో నిరసనలు, ఆందోళనలు ప్రతి రోజు జరుగుతుంటాయి.

కెనడా రాజధాని టొరంటో లో నివసించే బలుచ్ కార్యకర్త కరీమా బలుచ్ 2016లో రక్షా భందన్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘటన పాకిస్థాన్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఇది జరిగిన కొద్ది రోజులకే కరీమా బలుచ్ హత్యకు గురయ్యారు.

ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ 2018 భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో బెలుచిస్థాన్ అంశాన్ని ప్రస్తావించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై బలుచ్ ప్రజల కష్టాలను భారత్ ఎప్పుడు ప్రస్తావించలేదు. దీంతో నరేంద్ర మోడీ వ్యాఖ్యలతో బెలుచిస్థాన్ ప్రజలకు మేలు కన్నా నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పాలి.

పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్ దేశాల్లో మూడు ముక్కలుగా బెలుచ్ ప్రజలు ఉన్నారు. మూడింటిలో పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లోనే సహజ వనరులు అపారంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మద్దతు, ఆర్థిక వనరులు సమకూరితె బలూచ్ ప్రజలు ఏనాటికైనా స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎంతటి నియంతృత్వమైనా చరిత్రలో కలిసిన సందర్భాలు ఉన్నాయి.

బెలుచ్ ప్రజలకు కూడా మంచి రోజులు రావటం ఖాయం. ఆ రోజు తొందరగా రావాలని ఆశిద్దాం.

… దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్