Balochistan Groups : బలోచిస్తాన్ లో వేర్పాటువాద గ్రూపులు ఏకతాటి మీదకు వస్తున్నాయి. ప్రత్యేక బెలోచిస్తాన్ దేశం కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న సంస్థలు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. యునైటెడ్ బలోచ్ ఆర్మీ (UBA), బలోచిస్తాన్ రిపబ్లికన్ ఆర్మీ(BRA) రెండు ఏకమై బలోచ్ నేషనల్ ఆర్మీ(BNA)గా ఏర్పడ్డాయి. బలోచ్ ప్రజలందరిని ఐక్యం చేసి ప్రత్యేక బలోచిస్తాన్ దేశం ఏర్పాటే లక్ష్యమని బిఎన్ఏ నేతలు ప్రకటించారు. UBAకు ప్రముఖ నేత మేహ్రాన్ మర్రి కుమారుడు ఖైర్ బక్ష్ మర్రి నాయకత్వం వహిస్తుండగా, బిఆర్ఏ వర్గానికి ప్రముఖ బలోచ్ నేత అక్బర్ బుగ్తి కుమారుడు బ్రహ్మ్ దఘ్ బుగ్తి నాయకత్వం వహిస్తున్నారు. బలోచ్ తెగలలో మర్రి, బుగ్తి రెండు గ్రిజన తెగల నాయకులు ఏకం కావటంతో ఉద్యమం మరింత ఉదృతం అవుతుందని స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాలుగా ఈ రెండు తెగల మధ్య వైరం కొనసాగుతోంది. పాకిస్తాన్ పాలక వర్గాల కుట్రతో ఎన్నాళ్ళు ఎడమొహం, పెడమొహంగా ఉన్న మర్రి,బుగ్తి వర్గాలు ఏకం కావటం పాకిస్తాన్ తో పాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజా పరిణామాలతో పాకిస్తాన్ లో మరిన్ని అలజడులు తలత్తే ప్రమాదం పొంచి ఉంది. చైనా నిర్మించిన ఓడ రేవు గ్వదర్ లో స్థానికులకు ఉపాధి లభించటం లేదని ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్నాళ్ళుగా చైనా కంపనీలు, పాకిస్తాన్ సైన్యం మీద తరచుగా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల లాహోర్ లో పట్టపగలే జరిగిన దాడిలో ఇద్దరు చనిపోగా సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీని వెనుక బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హస్తం ఉందని పాక్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
దశాబ్దాలుగా దోపిడీకి గురవుతున్న బలోచిస్తాన్ లో రెండు అతి పెద్ద తెగలు బుగ్తి, మర్రి కాగా వాటికి నాయకత్వం వహించే నేతలు ఖైర్ బక్ష్ మర్రి, బ్రహ్మ్ దఘ్ బుగ్తిలు ఆయా వర్గాల్లో ప్రజాదరణ కలిగిన నేతలే కావటం పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : రష్యా- ఉక్రెయిన్ వివాదంపై యుకె అసహనం