Asaduddin Owaisi Denies Z Category Security :
కేంద్ర హోంశాఖ తనకు కేటాయించిన జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ తిరస్కరించారు. తన కారుపై కాల్పుల ఘటనను లోక్‌సభలో ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ.. తాను చావుకు భయపడబోనన్నారు. తనకు జడ్ కేటగిరీ భద్రత అవసరం లేదని, దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వారిని చూసి తాను ఏమాత్రం భయపడనన్నారు. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్ ద్వారా సమాధానం చెబుతారన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మీరఠ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీ వెళ్తుండగా.. ఆయన కారుపై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీకి తక్షణమే సీఆర్పీఎఫ్ బలగాలతో జడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది. అయితే, తనకు జడ్ కేటగిరీ భద్రత అక్కర్లేదని, అందరిలాగే తాను ఏ కేటగిరీ పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేశారు.
Also Read : అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.