Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిజామ్ నవాబు కలలో కనిపించిన వేంకటేశ్వరస్వామి!

నిజామ్ నవాబు కలలో కనిపించిన వేంకటేశ్వరస్వామి!

Deval Balaji Swayambhu Venkateswara Swamy Temple

వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాలు చాలానే కనిపిస్తాయి. స్వామి ప్రకృతి ప్రేమికుడు కావడం వలన ఎక్కువగా గుట్టలపై .. కొండలపై వెలసిన తీరు కనిపిస్తుంది. స్వామి తన భక్తులలో ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకుని వారి ద్వారా తన జాడలను తెలియజేసిన సందర్భాలు కనిపిస్తాయి. అలాగే తనకి నిత్య పూజలు జరిపించమని ఆదేశించిన ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తాయి. అలాంటి వేంకటేశ్వరుడు నిజామ్ నవాబు కలలో కనిపించి, తనకి నిత్య ధూపదీపాలు జరిగేలా చూడవలసిన బాధ్యతను ఆయనకి అప్పగించడం ఒక క్షేత్రంలో కనిపిస్తుంది .. ఆ క్షేత్రం పేరే ‘బండపాలెం’.

ఈ క్షేత్రం .. ఇప్పటి సూర్యాపేట జిల్లా పరిధిలో .. కోదాడ పట్టణానికి సమీపంలో విలసిల్లుతోంది. ఇక్కడ సువిశాలమైన ప్రదేశంలో పరచుకున్న ఒక పెద్ద బండ కనిస్తుంది. ఒక రకంగా ఇది కొండ ‘తల’ భాగంగా చెప్పుకోవచ్చు. ఈ బండపైనే శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వరస్వామి కొలువై కనిపిస్తాడు. చాలా కాలం క్రితం నిర్మించబడిన ఆలయంలో స్వామి వారు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ స్వామివారు ఆవిర్భవించిన తీరు .. నిజామ్ నవాబు కలలో కనిపించిన విధానం ఆసక్తికరమైన కథనాలుగా వినిపిస్తూ ఉంటాయి.

పూర్వం సువిశాలంగా పరచుకున్న బండకి సమీపంలో పంటపొలాలు ఉండేవి. ఇప్పటికీ ఈ ఆలయం పంటపొలాల సమీపంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఒక రోజున ఆ పంటపొలాల్లో రైతులు పనులు చేసుకుంటున్నారట. ఆ సమయంలో ఒక్కసారిగా గుర్రం సకిలింత వినిపించడంతో వాళ్లంతా ఆ దిశగా చూశారు. ఒక తెల్లని గుర్రంపై .. దివ్యమైన తేజస్సుతో కూడిన ఒక పురుషుడు ఆ బండ దిశగా వేగంగా వెళ్లడం చూశారు. ఆ యువకుడి చేతిలో ఖడ్గం చూసి .. వచ్చింది ఎవరో తెలియక ఆలోచనలో పడ్డారు.

అంతలో ఆ యువకుడు ఆ బండ పైభాగంలో గుర్రాన్ని ప్రదక్షిణ మార్గంలో మూడు మార్లు పరిగెత్తించి గుర్రంతో పాటు అదృశ్యమై పోయాడు. అది చూసిన పొలాల్లోని వాళ్లంతా పరుగున ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఒక శిలపై వేంకటేశ్వరస్వామి మూర్తి వెలసి ఉండటం చూశారు. ఆ రోజు నుంచే స్వామి వారిని పూజించడం మొదలైంది. ఆ తరువాత కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. పొడవైన .. విశాలమైన రాతి పలకల అమరికతో, ముఖ మంటపం .. అంతరాళం .. గర్భాలయ నిర్మాణం జరిగింది.

ఇది ఇలా ఉండగా .. నిజామ్ నవాబుకు ఒక రోజు రాత్రి ఒక కల వచ్చిందట. ఆయన కలలో కనిపించిన వేంకటేశ్వరస్వామి .. తనని బండపాలెం బాలాజీగానే పరిచయం చేసుకున్నాడట. తన ధూప దీప నైవేద్యాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఆయనే చూడవలసి ఉంటుందని చెప్పాడు. ఉదయాన్నే నిద్రలేచిన నవాబు .. తన అనుచరులను పిలిచి, ‘బండపాలెం’లో వేంకటేశ్వరస్వామి కొత్తగా వెలసి ఉంటే వెంటనే తనకి ఆ విషయం చెప్పమని పంపించాడు. అక్కడికి వెళ్లి వచ్చిన అనుచరులు .. కొన్ని రోజుల క్రితం అక్కడ స్వామివారు వెలసిన విషయాన్ని చెప్పారు.

తనకి వచ్చినది కల కాదు .. స్వామి నిజంగానే కనిపించి ఆదేశించాడనే విషయం నవాబుకు అర్థమైపోయింది. దాంతో తన తదనంతరం కూడా స్వామి వారి ధూప దీపాలకు అవసరమైన ఖర్చు తన వంశీకుల నుంచి వెళ్లేలా ఆయన ఒక లిఖిత పత్రం రాశారు ..  దీనినే ‘ముంతగబ్బ’ అంటారు. ఇప్పటికీ అప్పటి నవాబు వంశీకుల నుంచి స్వామివారి ధూప దీపాలకు అవసరమైన ఖర్చు వెళుతుండటం విశేషం. నవాబు రాసిన ‘ముంతగబ్బ’ ఇప్పటికీ భద్రంగా ఉందని అర్చకులు చెబుతారు. ‘పాంచరాత్ర ఆగమం’ ప్రకారం ఇక్కడ పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి.

గర్భాలయంలో స్వామివారి మూర్తి ‘సాలగ్రామ ఏకశిల’. కుదురైన రూపంలో స్వామి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. మనోహరమైన ఆ రూపాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవనిపిస్తుంది .. స్వామి సౌందర్యంపై సంకీర్తనలు పాడాలనిపిస్తుంది. స్వామి వారి ప్రతిష్ఠ జరిగిన కొంతకాలానికి గర్భాలయానికి ఒక వైపున ప్రత్యేక మందిరంలో లక్ష్మీదేవిని .. మరో వైపున  ప్రత్యేక మందిరంలో గోదాదేవిని ప్రతిష్ఠ చేశారు. లక్ష్మీదేవిని ‘పెరియ పిరాట్టి’గా పిలుచుకుంటూ ఉంటారు.

ఆలయం సువిశాలమైన బండపై ఉండటం వలన, స్వామివారి కైంకర్యాలకు అవసరమైన నీళ్లు లభించేవి కాదు. దూరంగా ఉన్న పంట కాలవ నుంచి అనునిత్యం నీళ్లు తెచ్చుకోవడానికి అర్చకులు ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లోనే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఆ సమయంలోనే ఒక ప్రదేశంలో బండ రెండుగా చీలిపోయి ‘కన్ను’ ఆకారంలో చిన్నపాటి కోనేరు ఏర్పడింది. ఇది అమ్మవారి మహిమగానే భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. స్వామివారి కైంకర్యాల కోసం ఈ కోనేరులో నీటినే వాడుతున్నారు.

ఇక గోదాదేవి ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి ఈ క్షేత్రంలో రామచిలకలు పెద్ద సంఖ్యలో కనిపిస్తుండటం విశేషమని చెబుతుంటారు. ధనుర్మాసంలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు .. సేవలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడాది ‘హోలీ పౌర్ణమి’ రోజున స్వామివారి కల్యాణం నేత్రోత్సవంగా జరుగుతుంది. ఆ రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు .. స్వామివారిని .. అమ్మవార్లను దర్శించుకుని తరిస్తారు.

– పెద్దింటి గోపీకృష్ణ

Also Read: ఒకే గర్భాలయంలో ముగ్గురు అవతార మూర్తులు! 

Also Read: గురు పరంపరకు ఆద్యుడు-దత్తాత్రేయుడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్