Wednesday, May 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగురు పరంపరకు ఆద్యుడు-దత్తాత్రేయుడు

గురు పరంపరకు ఆద్యుడు-దత్తాత్రేయుడు

Guru Purnima 2021 :

గురు పరంపరకు ఆద్యుడు.. శ్రీ దత్తాత్రేయుడు
(జులై 24న గురుపౌర్ణమి సందర్భంగా)

ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. గురుస్మరణ క్రమంలో దత్తాత్రేయుడే గురుపరంపరకు ఆద్యుడని ఆయన ఉపాసకులు విశ్వసిస్తారు. స్వయంగా తండ్రికి జ్ఞానబోధ చేయడం ద్వారా ఆయన గురుపరంపరకు ఆద్యుడయ్యాడని అంటారు. అనంతర కాలంలో దత్తప్రభువు.. కార్తవీర్యార్జునుడు, దలాదనుడు మొదలైన వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడని దత్తపురాణం చెబుతుంది.

దత్తాత్రేయుడిని స్మరణకు తెచ్చుకోగానే, మూడు ముఖాలు, ఆరు చేతులు, వెనుక కామధేనువు, ఔదుంబర (మేడి) వృక్షం, తన ముందు నాలుగు శునకాలు గల స్వరూపం మదిలో మెదలుతుంది. త్రిమూర్తుల ప్రతిరూపం, వారికి ఆధారమైన ప్రజ్ఞానమే దేహంగా, షట్ శాస్త్రాలే చేతులుగా, నాలుగుపాదాలపై నిలిచిన ధర్మమే గోవుగా, అవిద్యను నిర్మూలించే నాలుగు వేదాలే శునకాలుగా, విశ్వశాంతియే ఔదుంబర వృక్షంగా దత్తోపాసకులు భావిస్తారు.స్మరించిన క్షణమే..
స్వామి అమిత కరుణామూర్తి అన్నది దత్త భక్తుల దృఢ నమ్మకం. దత్తాత్రేయుడు స్మర్తృగామి.. అంటే, స్మరించిన వారి చెంతకు తక్షణమే చేరి కష్టాలను తీర్చే భగవానుడు. వింధ్యాచల ప్రాంతంలో నివసించే దలాదన మహామునికి, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామే ప్రసాదించిన ’’శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం’’లో ఈవిషయం స్పష్టంగా వుంటుంది. ఎల్లప్పుడూ దత్తాత్రేయుని ధ్యానంలో వుండే దలాదనమహాముని, ఒకసారి, దత్తాత్రేయుడు స్మర్తృగామి అన్నది నిజమేనా అని అనుకున్నాడట. వెంటనే ఆయన ముందు దత్తప్రభువు సాక్షాత్కరించాడట. దాంతో ఆయన స్వామికి క్షమాపణలు కోరి, నిన్ను స్మర్తృగామి అనేది నిజమో కాదో పరీక్షించేందుకు ఇలా స్మరించాను క్షమించండి అని అభ్యర్థిస్తే, అప్పుడు దత్తాత్రేయ స్వామి స్వయంగా ఇలా అంటాడు.
’’అభక్త్యా వా సుభక్త్యా వా యః స్మరేన్మానన్యధీః
తదానీం తముపాగమ్య దదామి తదభీప్సితం’’
అంటే, ’’భక్తి లేకున్నా, భక్తితోనైనా, ఎవరైనా సరే, మరో ఆలోచన లేకుండా నన్ను తలచుకుంటే చాలు, వెంటనే వారి దగ్గరకు వెళ్లి వారి కోరికలు తీరుస్తాను.’’ అని అర్థం. అందుకే దత్తాత్రేయ ఉపాసకులు అనన్య చిత్తంతో స్వామిని స్మరిస్తూవుంటారు. అలౌకిక సంపదలను పొందుతూ వుంటారు.

సహస్రార చక్ర అధిష్ఠానదేవత
దత్తాత్రేయుడే స్వయంగా అందించిన వజ్రకవచం, ఇతరత్రా వజ్రకవచాల కన్నా ఎంతో విభిన్నమైనది. ఇందులో స్వామివారిని, షడ్చక్రాల్లో భావిస్తూ, అంతర్బాహ్యేంద్రియాలను, అంగాంగాలనూ, దశదిక్కులను రక్షించమని ప్రార్థించడం కనిపిస్తుంది. వజ్రకవచం ప్రారంభంలోనే, ’’ఓం దత్తాత్రేయః శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః’’ అని వుంటుంది. అంటే, ఓంకార స్వరూపుడు, సహస్రారంలో కొలువైన దత్తాత్రేయుడు నా శిరస్సుని కాపాడుగాక అని అర్థం. అలాగే, దత్తాత్రేయ స్తుతిలో, దత్తాత్రేయం బ్రహ్మరంధ్రస్థం అని వుంటుంది. అంటే పరబ్రహ్మమైన దత్తుడి స్థానం సహస్రారమేనని, అందుకే దీన్ని బ్రహ్మరంధ్రం అంటారనీ ప్రతీతి.
సర్వపాపాలు హరించే నామం..
’’ద్రాం’’ అనేది దత్తాత్రేయ స్వామి బీజమంత్రం.. దీన్ని అనుష్ఠానిస్తూ స్వామివారి దత్త అన్న రెండక్షరాలు స్మరిస్తే చాలు సర్వపాపాలూ హరించుకుపోతాయని దత్తస్తవం చెబుతుంది. గోహత్య, బ్రహ్మహత్య, స్త్రీ హత్య, బాలహత్య లాంటి వేలాది పాపాలు, బంగారు దొంగిలించడం, మద్యసేవనం, పరదారాహరణం లాంటి లక్షలాది పాపాలు కేవలం దత్త అన్న రెండక్షరాల స్మరణతోనే తొలగిపోతాయని సాక్షాత్తు పరమేశ్వరుడే, స్వయంగా శుకుడికి తెలిపిన దత్త స్తవంలో వివరించాడు.
’’ కలిదోష వినాశార్థం జపేదేకాగ్ర మానసః
శ్రీగురుం పరమానందం దత్త ఇత్యక్షరద్వయం ’’
అంటే, దత్త అన్న రెండక్షరాలతో శ్రీగురుని ఏకాగ్ర చిత్తంతో జపిస్తే చాలు కలిదోషం నశించిపోతుంది’’ అని దత్త స్తవం చెబుతుంది.

Guru Purnima 2021 :

దిగంబరా దిగంబరా…
కలియుగ దత్తావతార పంచకాల్లో, శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి అవతారాలు రెండూ కీలకమైనవని దత్తోపాసకులు విశ్వసిస్తారు. దైవదూషకుల సంస్కారానికి, భక్తుల రక్షణకు దత్తుడే ఈ రూపాల్లో అవతరించాడన్నది వీరి నమ్మకం. పిఠాపురంలో అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు, తెలంగాణలోని మక్తల్ దగ్గరున్న కురుగుడ్డి (ఒకనాటి కురువపురం) వద్ద, శ్రీశైల క్షేత్రంలోని కృష్ణానదిలో అంతర్ధానమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారు కర్నాటకలోని గాణుగాపురం వద్ద అదృశ్య రూపంలో కొలువై నేటికీ తమను కరుణిస్తున్నారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గురుపౌర్ణమి శుభ తరుణాన, ’’దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, బ్రహ్మావిష్ణుమహేశ్వరా అవధూత చింతన దిగంబరా’’ అంటూ.. సర్వులూ, శ్రీదత్తాత్రేయ స్వామివారిని ఆరాధించి అభీష్టకామ్యాలను నెరవేర్చుకుంటారని ఆశిద్దాం.

శుభం భూయాత్
పి.విజయకుమార్
astrovijay67@gmail.com

Read More: కలి నుంచి కాపాడే దశ పాపహర దశమి

Read More: గంగ కడిగిన పాపలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్