బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు సైతం వేలాదిగా జనం తరలివచ్చి నీరాజనం పట్టారు. ఒకవైపు వాతావరణం అనుకూలించకపోయినా…మరోవైపు కాలి బొటనవేలికి గాయమై ఇబ్బందులు పడుతున్నా లెక్కచేయకుండా ప్రజలతో మమేకమై వారి సమస్యలు వినేందుకు అత్యంత ఆసక్తి చూపారు. జనం బాధలు వింటూనే వారిని ఓదారుస్తూ…. అందరికీ అండగా ఉంటామని భరోసా ఇస్తూ ముందుకు కదిలారు. అదే సమయంలో సంజయ్ వెంట తామున్నామని, బీజేపీగా అండగా ఉంటామంటూ పెద్ద ఎత్తున పాదయాత్రకు తరలివచ్చిన జనం సంఘీభావం తెలుపుతుండటం గమనార్హం.
తొలిరోజు బాపుఘాట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర టిప్పుఖాన్ సర్కిల్ మీదుగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోకి ప్రవేశించగానే వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, వ్రుద్దులనే తేడా లేకుండా పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. చిన్న పిల్లలను ఎత్తుకుంటూ…అందరితో కలిసిపోయారు. గీత కార్మికులుసహా దారి పొడవునా ఎదురైన ప్రజలందరినీ కలిసి వారికి అండగా ఉంటామని చెప్పారు. పెద్ద ఎత్తున మహిళలు బోనాలు, బతుకమ్మలు ఎత్తుకొని ఎదురేగుతూ సంజయ్ కు స్వాగతం పలికారు. మరికొందరు సంజయ్ పై పూల వర్షం కురిపించారు.
కొందరు మహిళలు సంజయ్ నుదుటిన వీర తిలకం దిద్ది బీజేపీకి అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడతామంటూ ప్రతినబూనారు. పాదయాత్రకు తరలివచ్చిన వారిలో అత్యధికులు సంజయ్ ను కలిసేందుకు, ఆయనతో కలిసి ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. బండ్ల గూడ చౌరస్తాలో ప్రవేశించగానే నాయకులు వినూత్నంగా నిలువెత్తు పూలదండలు తయారు చేయించి క్రేన్ తో నాయకుల మెడలకు అందేలా వేసి ఫోటోలు దిగారు.
అనంతరం ఆరెమైసమ్మ కాళీమందిర్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి స్థానిక నాయకులతో కలిసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరె మైసమ్మ వద్ద భావోద్వేగ ప్రసంగం చేసిన బండి సంజయ్ అక్కడి నుండి పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు సంఘీభావం తెలుపుతూ బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు, మాజీ మంత్రి లాల్ సింగ్ ఆర్య ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు.
బీజేపీ శాసనసభాపక్షనేత రాజాసింగ్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ సహా పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు, వివిధ మోర్చాల నేతలు సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలారు.