Bandi Sanjay Remanded For 14 Days :
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బండి సంజయ్ ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17వ తేదీ వరకు బండి సంజయ్ తో పాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్ కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరో 11 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై టూటౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశారు. సోమవారం మధ్యాహ్నం బండి సంజయ్‌తో పాటు ఐదుగురిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే, పాత కేసుల వివరాలను సైతం పోలీసులు ఈ రిమాండ్ షీట్ లో పేర్కొనడంతో న్యాయమూర్తి ఆ కేసులపై విచారణ జరిపారు. అనంతరం 14రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పోలీసులు సంజయ్ ని జైలు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో జిల్లాలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి, సంజయ్‌ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Also Read : కెసిఆర్ నీరో చక్రవర్తి -ఈటెల విమర్శ