బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం 1971లో పోరాడినవారి కుటుంబీకులకు ప్రభుత్వం 30% రిజర్వేషన్లు కల్పించింది. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనలకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను 5శాతానికి తగ్గించాలని సుప్రీం ఆదేశించింది. 93% ప్రతిభ ఆధారంగా, 2% మైనార్టీలు, దివ్యాంగులకు కేటాయించాలంది. పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆందోళనకారుల డిమాండ్.
BNP లీడర్ ఖలీదా జియా 1991-1996, 2001-2006 మధ్య బంగ్లా ప్రధానిగా ఉన్నారు. భారత వ్యతిరేక భావాలతో జియా బంగ్లాదేశ్ లో ఇన్నాళ్లు రాజకీయం నడిపారు. గత ఎన్నికల్లో షేక్ హసీనాకు భారత్ సహకరించి బంగ్లా ఎన్నికల్లో జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ భారత్ బహిష్కరణ పిలుపునిచ్చింది BNP. అధికార దుర్వినియోగం, ఇతర కేసులతో జియా 2018 నుంచి జైల్లో ఉన్నారు. ఆమెను రిలీజ్ చేస్తూ ప్రెసిడెంట్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.
షేక్ హసీనా 2019లో రెండోసారి పగ్గాలు చేపట్టాక చేసిన ప్రతీకార రాజకీయాలు ఆమె పతకానికి నాంది పలికాయి. 1971 యుద్ధ నేరాల కేసులను తిరగదోడి, విపక్ష నేతలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించి, వారిని జైళ్లకు పంపారు. విపక్షాలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. వీటికి తోడు దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, నిరుద్యోగం, హింస పెరిగిపోవడం లాంటి కారణాలు ప్రజల్లో తిరుగుబాటుకు దారితీశాయి..
షేక్ హసీనా పాలనలో భారత్-బంగ్లాదేశ్ మధ్య అనేక ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. జల పంపకాల వివాదాలు పరిష్కారమయ్యాయి. ఇరు దేశాలను కలిపే రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. టెర్రరిజాన్ని అరికట్టేందుకు హసీనా మన దేశంతో కలిసి పని చేశారు. అయితే హసీనా రాజీనామాతో మాజీ PM ఖలీదా జియా (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఆ పార్టీ చైనా, పాకిస్థాన్లకు అనుకూలంగా ఉండటం ఇండియాకు తలనొప్పే…
జమాతే ఇస్లామీ పాక్-బంగ్లాలో ప్రాబల్యం కలిగిన ఇస్లామిక్ రాజకీయ పార్టీ. 1941లో మౌలానా మౌదూది దీన్ని స్థాపించారు. బంగ్లాలో దీని విద్యార్థి విభాగం ఛాత్ర శిబిర్ కు ఐఎస్ఐ అండ ఉందని, విద్యార్థి ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమంగా మారడం వెనుక ఇదే కీలకంగా వ్యవహరిస్తోంది. బంగ్లా అల్లర్ల వెనుక ఈ పార్టీ హస్తం ఉందని షేక్ హసీనా ఆగస్టు 1న జమాతే ఇస్లామీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించారు.
ఆందోళనలు ఇప్పుడు హిందూ వ్యతిరేక దాడులుగా మారాయి. అధికార అవామీ లీగ్ పార్టీ నేతలతో పాటు దేశంలోని ఆలయాలు, హిందువులు, వారి ఆస్తులపై దాడులు తీవ్రమయ్యాయి. దీంతో ‘బంగ్లాదేశీ హిందువులపై అందరి దృష్టి’ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, హిందువులను ఊచకోత కోస్తున్నారని ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్’ ఆందోళన వ్యక్తం చేసింది.