Wednesday, June 26, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమనవెన్నే నిలిచేనా రైతు పేగు మాడితే?

మనవెన్నే నిలిచేనా రైతు పేగు మాడితే?

పల్లవి :-
పల్లెల్లో కళ ఉంది – పంటల్లో కలిముంది
అని చెప్పే మాటల్లో విలువేముంది ?
కళ్ళల్లో నీరుంది – ఒళ్ళంతా చెమంటుంది
ఆ చెమ్మకు చిగురించే పొలమే ఉంది

చరణం 1
చినుకివ్వని మబ్బుంది – మొలకివ్వని మన్నుంది
కరుణించని కరువుంది – ఇంకేముంది ?
రైతేగా రాజంటూ అనగానే ఏమైంది ?
అది ఏదో నిందల్లే వినబడుతోంది
అనుదినం ప్రతి క్షణం బదులేమివ్వని ప్రశ్నగా మారెనే కొడవలి ?
పైరుకా , పురుగుకా ఎవరికి మేలని తెలుసునా విషమయే ముందుకి ?

చరణం 2
వరి వెన్నే విరిసేనా గ్రామసీమ వాడితే ?
మనవెన్నే నిలిచేనా రైతు పేగు మాడితే ?
నమ్ముకున్న నేలతల్లి నెర్రెలుగా చీలితే ?
అమ్ముకున్న జీవాలన్నీ కబేళాకి చేరితే ?
ఏ చెవికీ వినబడవేం పల్లె తల్లి ఘోషలు ?
ఎవ్వరికీ కనబడవేం చిల్లుపడిన ఆశలు ?

సినిమా – యాత్ర
రచన – దర్శకుడు – మహి వి రాఘవ
గీతరచయిత – సిరివెన్నెల
గానం – బాలు
సంగీతం – కె


ఈ పాట విన్న తరువాత మాటలు మూగబోతాయి. గుండె బరువెక్కుతుంది. మసకబారిన రైతు విషాదం కళ్ళల్లో నీటి తెరగా మారుతుంది .

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఇతివృత్తంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో పాదయాత్రలో భాగంగా వచ్చే పాట ఇది. అసలు సినిమా, సందర్భంతో నిమిత్తం లేకుండా సర్వకాల, సర్వావస్థలకు అన్వయించారు సిరివెన్నెల. అన్నీ తెలిసిన తేలికయిన పదాలే. ఏముంది? ఇంకేం మిగిలింది? అని నిర్వేదంలో, నిట్టూర్పులో ఎవరయినా అనుకునే మామూలు మాటలే. కానీ…అందరి నోళ్ళల్లో నిత్యం నానే ఆ మాటలచేత సిరివెన్నెల ఇందులో ఎంత చాకిరి చేయించుకున్నారో? ఏడు పదులుదాటినా ఎవడురా నా గొంతుకు పోటీ అని బాలు సవాలు విసిరినట్లు పాడారు. ఎంత ఆర్ద్రత ? ఎంత ఆర్తి ?ఎంత విషాదాన్ని మునిపంట అదిమిపట్టి పాడినట్లు ఉంది.

మాల్యా 9 వేల కోట్ల ఋణం తీసుకుని లండన్ అతిశీతల వీధుల్లో సిగార్ తాగుతూ మనదేశ దీనావస్థను తలచుకుని తలుచుకుని బాధపడుతుంటాడు. రాళ్లను వజ్రాలుగా, వజ్రాలను బ్యాంకుల వాళ్లకు రాళ్లగా మలచి మోడీలు అమెరికా ఏడు నక్షత్రాల హోటళ్లలో న్యాయాన్యాయాల సమీక్షలు చేస్తుంటారు. లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టి రాజ్యలక్ష్మినే చెరబట్టిన రుణపురుషులు మనపక్కనే వీధికొకడు.  వీరికి భిన్నంగా రైతు లక్ష అప్పుకు 20 వేలు వడ్డీ కకట్టలేక పురుగులమందుతో ప్రాణాన్ని బ్యాంకుకు చెల్లు వేస్తాడు. రైతు పేరిటే ఉద్యమాలు, ప్రత్యేక పథకాలు, భిక్షాలు ఎన్నెన్నో?

కానీ…
రైతు ఒక విషాదం. రైతు ఒక చెదిరిన స్వప్నం. రైతు నిలువెత్తు కన్నీరు. రైతు ఒక ప్రశ్న. రైతు ఒక నిరాశ. రైతు ఒక అరణ్య రోదన.

రైతు కాళ్లు పుండ్లు పడి రక్తం కారేలా బొంబాయిలో పాదయాత్రలు చేసినా, రాజధాని నగరంలో సిగ్గువిడిచి తమ మూత్రం తామే తాగి నిరసన తెలిపినా, పరిహారమయినా కుటుంబానికి దక్కనీ అని పొలంలోనే కొమ్మకు ప్రాణాన్ని వేలాడేసినా – నేడు వ్యవసాయం ఒక దండగ. వ్యవసాయం ఒక అంటరానిది, చేతకానివారిది , తెలివిలేనివారిది, చదువురానివారిది.

చివరకు పల్లెలు పట్టణాల శిల్పారామాల్లో, వ్యవసాయం నగరాల ఎగ్జిబిషన్ లలో మాత్రమే చూసుకోవాల్సిన రోజులొస్తున్నాయి.

అలాంటి విధ్వంసమయిన పల్లెలకు, విషాదమైన రైతులకు ప్రతిధ్వని ఈ పాట.
ప్రతినిథి ఈ పాట.

పల్లెల్లో కళ , పంటల్లో కలిమి అని గొంతు చించుకుని అరుస్తుంటాం . కానీ కళ్ళల్లో రక్తం కారే రైతును చూడం- చూడలేం – చూడాలని అనుకోము . అలాంటప్పుడు మన మాటలకు విలువేముంది?

ఋతువుల్లో నీళ్లు లేకపోయినా – రైతు కళ్ళల్లో నీటితో, ఒళ్ళంతా చెమట చుక్కలతో పొలాన్ని ఎలాగో ఒకలా చిగురింపజేసుకుంటున్నాడు . కురవని మబ్బులు , మొలకివ్వని మన్ను రైతుకు తోడు నీడ. ఇలాంటప్పుడు రైతే రాజు అంటే పుండుమీద కారం పూసినట్లు ఉంది. కొడవలి ఫలసాయం కోయడానికి. తమాషానో…విషాదమో…అది ప్రశ్న గుర్తునే పోలి ఉంటుంది . రైతు ప్రశ్నకు కొడవలి కూడా ప్రశ్నగానే… సాయమూ, సమాధానమూ ఇవ్వలేక మిగిలి ఉంది. మందులు పురుగులకు ఆహారమై, రైతుకు విషమవుతున్నాయి.

వరివెన్ను విరిగి పల్లె ఎపుడో వెన్నెముక లేనిదిగా పడిపోయింది. రోజూ మనం కడుపుకు అన్నమే తినాలి. కానీ పండించే రైతు మాత్రం మూడుపూటలా విషమే తాగాలి. భవితలేక రైతు నుదురు నెర్రెలుగా చీలిపోయింది. ఒక్క గడ్డిపోచ లేక, గుక్క నీరులేక పెంచుకున్న పాడి పశువులను రైతే కబేళాలకు పంపుతున్నాడు.

అయినా మనం శెలవులప్పుడు మాత్రమే టోల్ గేట్ల నిరీక్షణలు దాటి గూగుల్ లో పల్లెలను వెతుకుతాం. చిల్లుపడిన పల్లెలను చూసేంత తీరిక, ఓపిక ఇప్పుడు మనకెక్కడ?

మదనపల్లెలో టమోటా రైతు కిలో పావలాకు అమ్ముకోలేక రోడ్లమీదే వదిలేసి వెళ్ళిపోతాడు. అనంతపురంలో వేసిన వేరుశెనగవిత్తనం నీరులేక చెదపురుగులు తింటే రైతు ఎండ్రిన్ తాగుతాడు. రంగారెడ్డి పూల రైతు పూలమ్మినచోట కట్టెలమ్మలేక గుడిమల్కాపూర్ చెత్తబుట్టకు వాడని పూలను అలంకరించి వెళతాడు. నిజామాబాద్ చెరకు తీపి…కానీ రైతుకు మిగిలింది చేదే . నూజివీడు మామిడి మనకే రుచి – రైతుకు అరుచి. అమలాపురం బెల్లం – రైతుకు అల్లం. పలాస జీడిలో ఎన్నెన్ని రక్తపు జీరలో?

కదిలిస్తే రైతు నిలువెల్లా కన్నీరు. ఎకో రసః కరుణ ఏవ. నలుగురు కూర్చుని నవ్వేవేళల నాపేరొకతరి తలవండీ – అని గురజాడ పూర్ణమ్మ అందరినీ అడిగింది. రైతుకూడా ఈ పాట ద్వారా అలాగే ఆడుతున్నాడు . కనీసం పట్టెడన్నం తినేవేళ అయినా పండించిన రైతు పచ్చగా ఉండాలని కోరుకుందాం .

సందర్భం:-
తెలంగాణ కామారెడ్డి జిల్లాలో 2010 లో రైతులు తమ పొలాలు తాకట్టు పెట్టి…జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నుండి పంటరుణాలు తీసుకున్నారు. వరుసగా పంట నష్టాలు. ఏ కొందరో తప్ప…ఎక్కువమంది అప్పు తీర్చలేకపోయారు. అసలు, వడ్డీ కలిసి 2024 మార్చి నాటికి 5 లక్షలు కాస్త 15 లక్షలయ్యింది. తల తాకట్టు పెట్టినా ఇప్పుడు కొత్తగా అయిదు పైసలు కూడా అప్పు పుట్టదు. బ్యాంకు నోటీసుల మీద నోటీసులు పంపి…చివరికి అప్పులు తీర్చని రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు పెట్టింది. “ఈ భూమిని తాకట్టు పెట్టిన ఫలానా రైతు అప్పు తీర్చనందుకు ఫలానా తెలంగాణ యాక్ట్ ప్రకారం భూమిని వేలం వేయడానికి స్వాధీనం చేసుకోవడమైనది” అని తాటికాయంత అక్షరాలతో ఆ ఫ్లెక్సీ గుడ్డివాడికి కూడా కనిపించేంత పెద్దదిగా పొలంలో బలంగా నాటారు.

ఇప్పుడు మళ్లీ పైకి వెళ్లి సిరివెన్నెల రైతు చేతిలో కొడవలి ప్రశ్న గుర్తుగానే ఎందుకు మిగిలిపోయిందో గుండె తడితో చదువుకోండి.

అయిదు వేల కోట్ల బ్యాంక్ రుణం ఎగ్గొట్టినవాడు ఎమ్మెల్యే కావచ్చు. పదివేల కోట్ల రుణం ఎగ్గొట్టినవాడు ఎం పి కావచ్చు. పాతికవేల కోట్లు ఎగ్గొట్టినవాడు పెట్టే బేడా సర్దుకుని…రెక్కలు కట్టుకుని సొంత విమానంలో దేశం దాటి వెళ్లిపోవచ్చు. లక్షల కోట్లు ఎగ్గొట్టిన పెద్ద గద్దలకు జీ హుజూర్ అని ప్రభుత్వాలే రుణాలను శాశ్వతంగా రైట్ ఆఫ్ చేసి…ఆ భారాన్ని బాధ్యతగా పన్నులు కట్టే దేశ పౌరులందరికీ సమానంగా పంచవచ్చు.

ఆరుగాలం ఎండనక వాననక…తినీ తినక పండించే రైతు అప్పు అయిదు లక్షలు కాస్త ప్రకృతి కరుణించక పదిహేను లక్షలు అయితే మాత్రం- అతడిని చిత్రవధ చేయాల్సిందే. అతడి ఆత్మాభిమానాన్ని అతడి పొలంలోనే ఫ్లెక్సీ వేలం వేయాల్సిందే. బతికి ఉండగానే అతడికి తలకొరివి పెట్టాల్సిందే. కడుపుకు అన్నం తినేవారందరూ ఇవన్నీ చూస్తూ ఉండాల్సిందే.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్