లోక్ సభ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్ఎస్ కు తాజాగా మరో షాక్ తగిలింది. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లో పోచారం ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనను కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి సిఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నో సేవలందించారని కొనియాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఆఖరుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని, రేవంత్ కార్యక్రమాలు నచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస పార్టీలోకి వచ్చినట్టు వెల్లడించారు. రైతుల సంక్షేమాన్ని కోరుకునే రేవంత్‌ను భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నానన్న పోచారం ఆనాటి పరిస్థితులను బట్టి టీఆర్ఎస్‌లో చేరినట్టు వివరించారు. జీవితంలో రాజకీయంగా ఆశించేది ఏం లేదని, రైతులతో పాటు వ్యవసాయం బాగుండాలన్నారు. రాష్ట్ర ప్రగతిలో చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నానని పోచారం తెలిపారు.
-దేశవేని భాస్కర్