Thursday, May 22, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్

బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్

‘ఈ అమ్మాయి కారణంగా కుటుంబం పరువు పోతుంది’- అన్నవారు ఈ రోజు బాను ముస్తాక్ ని చూసి గర్వపడుతున్నారు. ముస్లిం కుటుంబాల్లో మహిళల కష్టాలు, కన్నీళ్లను కథల రూపంలో ప్రపంచానికి పరిచయం చేసి ఈ రోజు బుకర్ ప్రైజ్ విజేత గా నిలచిన 77 ఏళ్ళ బాను జీవితం స్ఫూర్తిదాయకం. కర్ణాటక రాష్ట్రం లోని హసన్ నుంచి మొదలైన బాను ప్రయాణం ఆమె రాసిన కథలకు ఏ మాత్రం తీసిపోదు.
పాఠశాల రోజుల్లోనే తన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చిన బాను బంధువుల కోపానికి గురయింది. కానీ తండ్రి నమ్మకం ఆమెను ఉన్నత విద్య అభ్యసించేందుకు దోహదపడింది. ప్రేమవివాహం చేసుకున్నాక ఎదురైన ఆంక్షలు ఆమెను ఆత్మహత్యా యత్నానికి పురికొల్పగా భర్త రక్షించారు. అప్పటినుంచి చదువు, రచనా వ్యాసంగాలపై దృష్టి పెట్టారు. విప్లవ, దళిత సంఘాలతో పనిచేసారు. జర్నలిస్టుగానూ కొన్నాళ్ళు పనిచేశారు. అప్పట్లోనే ఈమెపై హత్యాయత్నం జరిగింది . మళ్ళా భర్తే కాపాడుకున్నారు. కుటుంబం కోసం లాయరు వృత్తి చేపట్టారు. మరోపక్క ముస్లిం మహిళల జీవితాలపై కథలు రాయడం కొనసాగించారు. అలా 1990 నుంచి రాసిన 12 కథలు దీపా భస్తి ‘ హార్ట్ లాంప్’ పేరిట ఆంగ్లం లోనికి అనువదించారు. దానికే బుకర్ ప్రైజ్ ( సుమారు 57.55 లక్షలు) అందుకున్నారు. కేవలం 12 కథల్లో మహిళల వ్యదార్థ భరిత జీవితాన్ని హృద్యంగా ఆవిష్కరించారని బుకర్ ప్రైజ్ జ్యూరీ సభ్యులు బాను ను కొనియాడారు. లండన్ లో జరిగిన కార్యక్రమంలో బాను, దీప పురస్కారం అందుకున్నారు. అంతకు ముందు హసీనా అండ్ అదర్స్ అనే చిన్న కథల సంకలనానికి గాను 2024 లో ఇంగ్లీష్ పెన్ ట్రాన్సలేషన్ అవార్డు అందుకున్నారు. ఇది కూడా దీపా భిస్తి అనువదించినదే.

వెనకబడినవర్గాలు, మైనారిటీల అభివృద్ధి లక్ష్యంగా 1980 లో జరిగిన బందయ సాహితీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు బాను. తర్వాత హాసన్ పట్టణ మునిసిపల్ కౌన్సిలర్ గా రెండు సార్లు ఎన్నికయ్యారు. తెలుగు తప్ప ఇతర దక్షిణాది భాషల్లో ఆమె రచనలు అనువదించారు. ఆరు దశాబ్దాల్లో అరవైకి పైగా కథలు రాశారు. ఇందుకుగాను 1999 లో కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

బుకర్ ప్రైజ్ అందుకున్నాక బాను ముస్తాక్ అనుభూతి ఏమిటి?
‘ఆకాశంలో ఒకేసారి వంద మిణుగురు పురుగులు ఎగిరినట్లు ఉంది’  నిజమే, బానుకే కాదు, ఆమె సాహిత్య అభిమానులు, కుటుంబానికీ ఇది ప్రత్యేక సందర్భం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కూడా ‘కన్నడిగులు ఉత్సవం చేసుకోవలసిన సందర్భం’ అన్నారంటే ఈ పురస్కారం ప్రత్యేకత అర్థమవుతుంది. ‘బ్రేవో బానూ ముస్తాక్’ మీ రచనలు సైతం మిణుగురుల్లాగే ప్రకాశిస్తున్నాయి’

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్