ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కొనియాడారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కృష్ణయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. చారిత్రాత్మకమైన బీసీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. సమర్ధవంతమైన, అవినీతికి తావులేని పాలన అందిస్తూ దేశంలోనే గుర్తింపు పొందారని కృష్ణయ్య ప్రశంశలు కురిపించారు.
బీసీలకు సంబంధించిన పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని సిఎం జగన్ కు కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. 56 బీసీ కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటుచేయడం, కాంట్రాక్టులు, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేస్తూ అసెంబ్లీలో చట్టబద్దత కల్పించడం వంటి కార్యక్రమాలతో పేదవర్గాలకు ప్రజాపాలనను అతి దగ్గరగా తీసుకెళ్లారని, మున్ముందు మరింతగా పేదల పక్షాన నిలిచేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీల డిమాండ్‌లు నెరవేర్చేందుకు కృషిచేయాలని సీఎం జగన్ ను కోరారు.