Tuesday, March 19, 2024
HomeTrending Newsఊహాజనితం సరికాదు: బొత్స

ఊహాజనితం సరికాదు: బొత్స

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే చట్టబద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని.. అయితే చట్టంలో ఆంధ్ర ప్రదేశ్ కోసం ఇంకా కొంత చేసి ఉండాల్సిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఒకవేళ సుప్రీం కోర్టు కనక ఇది చట్టబద్ధంగా జరగలేదని చెబితే.. రెండు రాష్ట్రాలూ తిరిగి కలిసి పోయే పరిస్థితి వస్తే తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తామని ప్రకటించారు. అయితే ఈ అంశంపై ఊహాజనితంగా మాట్లాడడం సరికాదన్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలని, దీనిపై అనవసర చర్చలు సమయం వృధా చేయడమేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్సీపీ జయహో బిసి సదస్సుపై విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని బొత్స మండిపడ్డారు. పక్కన కూర్చోబెట్టుకోలేదని, భుజం మీద చెయ్యి వేయలేదని పలు రకాలుగా చులకనగా ప్రచారం చేస్తున్నాయని,  బిసి మంత్రులు డమ్మీలు అంటూ టిడిపి చేస్తున్న ప్రచారంపై కూడా బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేతులు కట్టుకొని నిల్చున్నామంటూ మాట్లాడడం హేళన చేయడమేనన్నారు.  గతంలో ఒక బిసిని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా నియమించాలంటే  ఎంతో కష్టపడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు దేవాలయ పాలక మండళ్ళ నుంచి రాష్ట్ర స్థాయి పదవుల వరకూ సగం పదవులు బీసీలకే కేటాయించి వారికి రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు.  బలహీనవర్గాలకు 50 శాతం పదవులు  కేటాయించాలని, పదివేల జనాభా పైబడి ఉన్న కులాలకు తాము కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఎన్ని ముందే నిర్ణయం తీసుకున్నామని బొత్స గుర్తు చేశారు.  తెలుగుదేశం ప్రభుత్వంలో బిసి మంత్రులను చంద్రబాబు భుజాల మీద చేతులు వేసి తిరిగారా అని ప్రశ్నించారు. గతంలో తమ కులాలకు ఏం చేశారో బాబును ఆ పార్టీ నేతలు నిలదీయాలని అన్నారు.

తమ ప్రభుత్వంఇప్పటి వరకూ వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెట్టిందనే విషయాన్ని సిఎం జగన్ మోహన్ రెడ్డి నిన్న స్పష్టంగా వివరించారని అన్నారు. సింహ భాగం నిధులు  బీసీలకు వినియోగించామని, వివిధ పథకాల ద్వారా వారికి మేరు జరిగిందని తెలిపారు.  తాము చెప్పిన విషయాల్లో ఏవైనా తప్పులు ఉంటే చెప్పాలని.. అంతే కానీ కించపరిచేలా మాట్లాడడం సమంజసం కాదన్నారు.  బీసీలు ఇంకా వెనుకబడే ఉండాలన్న ఆలోచన మంచిది కాదని, ఆ భావన నుంచి విపక్షాలు, మీడియా బైటకు రావాలని సూచించారు. బిసిలకు ఇంకా ఎలా మేలు చేయాలో చెప్పాలి కానీ విమర్శలు  చేయడం తగదన్నారు. తమను ఇంతగా గౌరవిస్తున్న సిఎం జగన్ మోహన్ రెడ్డి ని కాపాడుకోవాల్సిన బాధ్యత బిసిలపైనే ఉందని బొత్స అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్