Beggar Donates To CM Relief Fund :
“తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగ బోడు
విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని
కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి
దాన ధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగలకిత్తురో దొరలకవునో
తేనె జుంటీయదా తెరువరులకు
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర!”
“ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే?”
మొదటి పద్యం తల్లి గర్భము నుండి – కవి శేషప్ప నృసింహ శతకంలోనిది. బాగా ప్రచారంలో ఉన్న పద్యం. తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు వెంట ఏమీ తీసుకురాము. చనిపోయాక ఏదీ వెంట తీసుకుని వెళ్లం. ఎంతటి కోటీశ్వరుడయినా మెతుకులే తినాలి. డబ్బు మూలుగుతోంది కదా అని మెరుగుబెట్టిన బంగారు గింజలయితే తినలేడు. డబ్బు సంపాదించి ఎంత విర్రవీగినా, దాన ధర్మాల్లేక, నేల మాళిగల్లో రహస్యంగా దాచుకున్నా…చివరకు దొంగలయినా దోచుకెళతారు. ఆదాయపు పన్ను దొరలయినా పట్టుకెళతారు. తేనెటీగ ఎంతో కష్టపడి చుక్క చుక్కను తుట్టెలో భద్రపరుచుకుంటే…దారినపోయే వారు పొగబెట్టి తేనెను తీసేసుకుంటారు. కాబట్టి ఎంతో కొంత దానధర్మాలు చేసి బతుకును, సంపదను సార్థకం చేసుకోవాలి.రెండో పద్యం ఆదిన్ శ్రీసతి – పోతన భాగవతం – వామనావతార ఘట్టంలోనిది. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తుంటే విష్ణువు వామనుడుగా వెళ్లాడు. అప్పుడే ఉపనయనమై…పసుపు బట్టలతో ముద్దుగా ఉన్న వామనుడిని చూడగానే బలి చక్రవర్తి మనసు పొంగిపోయింది. యజ్ఞానికి వచ్చిన అందరికీ యజమాని దానాలివ్వడం సంప్రదాయం. ఏమి కోవాలో కోరుకో…ఏదయినా కాదనకుండా, లేదనకుండా ఇస్తా అని బలి చక్రవర్తి వామనుడికి హామీ ఇచ్చాడు. వచ్చినవాడు విష్ణువు. జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మాట తప్పితే పెద్ద తప్పు కాదు- అని రాక్షస గురువు శుక్రాచార్యుడు బలిని హెచ్చరించాడు. అప్పుడు బలి చెప్పిన పద్యమిది. పోతన మాత్రమే రాయగలిగిన గొప్ప పద్యమిది. సాక్షాత్తు శ్రీ మహా లక్ష్మిని శాసించే విష్ణువు చేయి దానం తీసుకుంటూ కింద ఉండి…నా చేయి దానమిస్తూ పైన ఉండడం కంటే జన్మ సార్థకం కావడానికి ఇంకేమి కావాలి? ఈ రాజ్యం- గీజ్యం, సంపద- గింపద,
ఆయుస్సు – గీయుస్సు శాశ్వతమా? దానమిచ్చి తీరతాను అని బలి చెప్పిన మాట- సకల పురాణాల్లో మణిపూస లాంటి మాట.
తల్లి గర్భము, ఆదిన్ శ్రీసతి రెండు పద్యాలు తెలుగు సాహిత్యంలో అజరామరమయిన పద్యాలు. పదే పదే స్మరించుకోవాల్సిన గొప్ప భావాలు.
తమిళనాడులో ఒక మారుమూల గ్రామంలో ఎనభై ఏళ్ల యాచకుడు తన యాచన ద్వారా దాచుకున్న నాలుగున్నర లక్షల రూపాయలను సీ ఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు. వార్త చిన్నదే కావచ్చు కానీ చాలా గొప్పది. ఒక యాచకుడి కోణంలో చూస్తే నాలుగున్నర లక్షలు నాలుగు వందల కోట్లతో సమానం.
Beggar Donates To CM Relief Fund కొన్ని సందర్భాల్లో దానధర్మాలు, విరాళాల పరిమాణాన్ని చూడకూడదు. ఒకాయన వెంకన్నకు యాభై కోట్ల వజ్రాల కిరీటమిచ్చాడు. ఆయన స్థాయి అది. ఆ యాభై కోట్లు ఎలా సంపాదించాడో వెంకన్నకు తెలిసే ఉంటుంది. మనకనవసరం. కష్టార్జితమే దేవుడి హుండీలో వేయాలని నియమమేమీ లేదు.
అదే వెంకన్నను ఒక చక్రవర్తి రోజూ బంగారు పూలతో పూజ చేసే వాడు. ఆయనేమో ఒక కుమ్మరివాడు రోజూ భక్తిగా సమర్పించే మట్టి పువ్వును మాత్రమే పొంగిపోయి స్వీకరించేవాడు. అప్పటినుండే అన్నమయ్య చెప్పినట్లు తోమని పళ్ళాల వాడయ్యాడు వెంకన్న. ఆ భక్తుడు ప్రేమగా మట్టి పెంకులో పెరుగన్నం ముద్ద అలవాటు చేసినందుకు గుర్తుగా ఇప్పటికీ రోజూ ఒక మట్టి పెంకులో పెట్టిన పెరుగన్నాన్నే తింటున్నాడు వెంకన్న. ఆ మట్టి పెంకును కడగకుండా మట్టిలో కలిపేస్తారు. అందువల్ల తోమని పళ్లెం వెంకన్నకు ఒక నిరుపేద సామాన్య భక్తుడి అసామాన్య నివేదన. అది ఆచారమయ్యింది. మిగతా బంగారు పళ్ళాలు అన్నీ దేవుడికి దూరంగా బయటే మనకోసం ఉంటాయి.
అలా ఈ యాచకుడి నాలుగున్నర లక్షలు కూడా అసామాన్యమయిన విరాళం. సమాజానికి ఇచ్చిన అవిరళ సందేశం.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read : నూరేళ్ళ జీవితానికి మేలైన సూత్రాలు